RS Praveen Kumar on Cancellation Of GO 111 : రాష్ట్రంలో కంపెనీల పేరిట విలువైన పచ్చని పేదల భూములు బలవంతంగా ప్రభుత్వం లాక్కొంటుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. పేద, చిన్న, సన్నకారు రైతులను అడ్డా కూలీలుగా మార్చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కేసీఆర్ సర్కారు స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో బంధీ అయిందని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టు పక్కల వేల ఎకరాల భూములను అక్రమంగా కొనుగోలు చేసిన కేసీఆర్ బినామీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల మెప్పుకోసమే 111 జీవోను ఎత్తి వేశారని ఈ సందర్భంగా విమర్శించారు. 111 జీవో ఎత్తి వేయడం వల్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరించారు. తొమ్మిదేళ్లుగా బీసీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి, బీసీ కమిషన్ కోరలు తీసేసిన ముఖ్యమంత్రికి బీసీల అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత లేదని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
ఈ క్రమంలోనే చేతి వృత్తులు, కుల వృత్తులకు బడ్జెట్‌లో కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను.. దారి మళ్లించి ఈ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. బీసీలపై ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలన గాలికొదిలేసి.. రూ.వేల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టిన కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి గద్దె దించే వరకు బీఎస్పీ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.
"జీవో 111 రద్దు చేయడం వెనుక రూ.వేల కోట్ల డబ్బులు చేతులు మారాయి. ఎందుకంటే ఈ రోజు 84 గ్రామాల ప్రజల దగ్గర ఆ భూమి లేదు. ఆ భూమి మొత్తం బీఆర్‌ఎస్ నాయకులు దగ్గర ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 30 వేల ఎకరాల భూమి పేద ప్రజల వద్ద నుంచి ఈ ప్రభుత్వం తీసుకుంది. పేద ప్రజలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన ప్రభుత్వ భూమిని వాళ్ల చేతిలో పెట్టకుండా.. వారికి ప్రైవేటు పట్టా ఇవ్వకుండా ఈ వేళ తెలంగాణ సీఎం ఏం చేస్తున్నారు అంటే వాళ్ల భూములను బలవంతంగా గుంజుకుంటున్నారు." - ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి :