Forest officer wife became Tahsildar : స్మగ్లర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన సేవలను ప్రశంసిస్తూ శ్రీనివాసరావు కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. ఇంటి స్థలం, ఆర్థిక సహాయంతో పాటు డిప్యూటీ తహసీల్దార్‌గా శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరులో జరిగిన హరితోత్సవ సభలో నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అందజేశారు. అటవీ శాఖ అధికారుల భద్రత కోసం ఆయుధ సంపత్తిని పెంచడంతో పాటు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అటవీ అధికారుల కుటుంబానికి ప్రభుత్వం చేయూత నివ్వడంతో పాటు అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్స్ చరిత్రలోనే నిబంధనలను సడలించి ఉద్యోగం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కేసీఆర్ తమ కుటుంబానికి తండ్రిగా నిలబడి ఆదుకున్నారని, కుటుంబం తరపున ధన్యవాదాలు చెబుతున్నట్లు భాగ్యలక్ష్మి తెలిపారు.
"రాష్ట్ర ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకున్నందుకు ధన్యవాదములు. మాకు ఇంటి స్థలం ఇచ్చారు. దీంతో పాటు ప్రభుత్వం రూ.50,00,000 ఆర్థిక సాయం చేసింది."- భాగ్యలక్ష్మి, అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావు భార్య
రెవెన్యూ, అటవీశాఖల నిర్లక్ష్యం.. అటవీభూముల్లో తలెత్తిన వివాదం!
అసలు ఏమి జరిగిందంటే.. : 2022 నవంబర్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండలపాడు అటవీ ప్రాంతంలో పోడు భూముల సాగుదారుల దాడిలో అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. అటవీ భూములను రక్షించేందుకు వెళ్లిన ఆ అధికారిపై.. గుత్తికోయలు కత్తులు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తోటి అధికారులు వైద్యశాలకి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందించారు. ఫారెస్ట్ అధికారులపై దాడులను సహించేది లేదని హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. అటవీ అధికారులు మనోబలం కోల్పోవద్దని చెప్పారు. అధికారి కుటుంబానికి అండగా ఉంటామని.. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖ వ్యక్తులు సంతాపం తెలిపారు. ఇదే విధంగా అటవీ రక్షణలో భాగంగా విధి నిర్వాహణలో అసాంఘిక శక్తుల దాడిల్లో మరణించే అటవీ శాఖ అధికారులకి, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చదవండి :