Housing issues in Telangana : రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి గతంలోనే పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశారు. అప్పట్లోనే పలు దఫాలు సమావేశమైన సబ్ కమిటీ.. సంబంధిత అంశాలపై కసరత్తు చేసింది. వివిధ ప్రభుత్వ భూముల్లో పేదలు ఇల్లు నిర్మించుకున్న స్థలాలు, గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామకంఠంలో ఉన్న ఇళ్ల స్థలాల అంశాలు.. పట్టణ ప్రాంతాల్లో 58, 59 ఉత్తర్వుల కింద క్రమబద్ధీకరణ తదితరాలపై చర్చించింది.
Allotting Houses To beneficiaries in Telangana : తాజాగా రెండు రోజుల క్రితం సమావేశమైన ఉపసంఘం.. వీలైనంత త్వరగా ఈ సమస్యలన్నింటిని పరిష్కరించి అర్హులకు పట్టాలు ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించింది. శనివారం లోపు పూర్తి వివరాలు అందించాలన్న మంత్రులు.. సోమవారం మరోసారి అన్ని అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. సంబంధిత అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. తాజాగా ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్నారు.
నియోజకవర్గాల వారీగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్యలు, అంశాలకు సంబంధించి సమగ్ర వివరాలను అందించాలని కలెక్టర్లను సీఎస్ ఇప్పటికే ఆదేశించారు. నిర్దేశిత నమూనాలో ఆ సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని అన్ని రకాల భూముల వివరాలు, సమాచారాన్ని కోరారు. ఆ వివరాలు, సమాచారాన్ని మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించనున్నారు. సమస్యల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను మంత్రుల దృష్టికి తీసుకెళ్ల నున్నారు. వాటిని పరిశీలించి మంత్రివర్గ ఉప సంఘం ఓ నిర్ణయానికి వచ్చి, సమస్యల పరిష్కారం, పట్టాల పంపిణీ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక అందించనుంది. 59వ జీవో కింద ఉత్తర్వుకు లోబడి క్రమబద్ధీకరణకు సంబంధించి అధికారుల నుంచి యజమానులకు ఇప్పటికే డిమాండ్ నోటీసులు అందాయి.
అయితే క్రమబద్ధీకరణ కోసం నిర్దేశించిన మొత్తం విషయంలో ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. క్రమబద్ధీకరణ కోసం డిమాండ్ నోటీసులో పేర్కొన్న మొత్తం భారీగా ఉందని, ఉత్తర్వుల్లో పేర్కొన్న నిర్దేశిత విలువ ప్రకారం కాకుండా ప్రస్తుత మార్కెట్ ధరను పరిగణలోకి తీసుకున్నారని ఫిర్యాదులు అందాయి. ఇదే సమయంలో ఒకే ప్రాంతంలోని స్థలాలకు కూడా వేరువేరు ధరలు నిర్ధారించారని, చాలా వ్యత్యాసం ఉందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో క్రమబద్దీకరణ రుసుముల అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతోంది. త్వరలోనే సవరించిన మార్గదర్శకాలను వెలువరించే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలకు సంబంధించిన అన్ని అంశాలను ఓ కొలిక్కి తీసుకొచ్చి పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇవీ చదవండి: