కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ అమలు ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రంగా ఉంది. గత నెల 23 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలవుతోంది. దీంతో రాష్ట్ర ఖజానాకు ఎలాంటి ఆదాయం లేదు. వివిధ రూపాల్లో రాష్ట్రానికి నెలకు రూ. 6,500 కోట్ల ఆదాయం సమకూరాలి. అయితే అందులో నామమాత్రం కూడా వచ్చే పరిస్థితులు లేవు. రూ. 5 వేల కోట్ల పన్నుల రాబడి పూర్తిగా లేకుండా పోయింది. జీఎస్టీ ద్వారా నెలా రూ. 2 వేల కోట్ల ఆదాయం వస్తుంది. కేంద్రం నుంచి పన్నుల్లో రాష్ట్ర వాటాగా ప్రతినెలా 1400 కోట్ల రూపాయలు వస్తాయి. అయితే కేంద్రం ఇందులో ఏ మేరకు నిధులు ఇస్తుందన్నది ప్రశ్నార్థకంగానే ఉంది.
జీఎస్టీ వసూళ్లు లేనందున..
జీఎస్టీ వసూళ్లు లేనందున పరిహారంగా 2000 కోట్ల రూపాయలు ఇస్తే ఉపకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అటు విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలకు తగిన తోడ్పాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. రుణపరిమితి పెంపు, రుణాల చెల్లింపుల వాయిదా, హెలికాప్టర్ మనీ విధానం లాంటి ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రం ముందు ఉంచారు. వాటిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏప్రిల్ నెల వ్యయం కింద రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు పది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఫించన్లు, రుణాల చెల్లింపులు, కోవిడ్ చికిత్స-పరీక్షలకు వ్యయం, నిరుపేదలు, వలస కూలీలకు సాయం, స్థానిక సంస్థలకు నిధులు సహా పలు అవసరాలను ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది.
ఏప్రిల్లో లేని కనీస ఆదాయం:
రాష్ట్ర ఖజానాకు ఏప్రిల్లో కనీస ఆదాయం లేదు. బాండ్ల ద్వారా ఇప్పటికే రూ. 2000 కోట్లు సమకూర్చుకొంది. ఈ నెల 28న బాండ్ల రూపంలోనే మరో వెయ్యి కోట్లు సమకూరుతాయి. దీంతో 3000 కోట్లు అందుబాటులో ఉన్నట్లవుతుంది. కేంద్రం నుంచి రాష్ట్ర వాటా 1400 కోట్ల రూపాయలు, జీఎస్టీ పరిహారం కింద 2000 కోట్లు వస్తే బాగుంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. వీటితో పాటు రాష్ట్రాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం కొంత ఆర్థిక తోడ్పాటు ఇవ్వడంతో పాటు రుణాల చెల్లింపుల వాయిదా, రుణపరిమితి పెంపు సహా ఇతరత్రా నిర్ణయాలు తీసుకుంటే విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రం గట్టెక్కుతుందని అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: ఈనెల 19న మంత్రివర్గ సమావేశం.. లాక్డౌన్పై చర్చ