రాష్ట్రవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో అసలు లేఅవుట్ సక్రమమా... అక్రమమా అనేది కూడా చాలామంది ఆలోచించడం లేదు. ప్రస్తుతానికది అక్రమమైనా మున్ముందు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందిలే అనే ధీమాతో కొందరు కొనేస్తున్నారు. ఇలాంటి చోట ధరలు తక్కువగా ఉండటం, ఇప్పటికిప్పుడు నిర్మాణాలు చేయకపోయినా భవిష్యత్ అవసరాలకు ఉంటుందనే నమ్మకంతో ప్లాట్లను తీసుకుంటున్నారు. ప్రభుత్వం తాజాగా అనధికార లేఅవుట్‌లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై కొరడా ఝుళిపించింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రిజిస్టర్ అయిన ప్లాట్లను ఇకపై రిజిస్ట్రేషన్ చేయకూడదని ఆదేశించింది. దీంతో అనధికార లేఅవుట్‌లలో ప్లాట్లను కొన్నవారు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటిదాకా క్రమబద్ధీకరణ ఇలా...
రాష్ట్రంలో పట్టణాలు, నగరాలు, మాస్టర్ ప్లాన్ పరిధిలోకి వచ్చే పంచాయతీల్లో అక్రమ లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్)కు అవకాశం ఇస్తూ 2015 నవంబరు రెండో తేదీన ప్రభుత్వం జీవో 151 జారీ చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు వివిధ దఫాలుగా 2016 డిసెంబరు 31 వరకూ అవకాశం కల్పించింది. దరఖాస్తుల పరిష్కారానికి కూడా గత ఏడాది డిసెంబరు 31 వరకూ పలు దఫాలుగా గడువు పొడిగించింది. తాజాగా కొత్త పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల ఏర్పాటు నేపథ్యంలో వందల గ్రామాలు పట్టణ స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చాయి. దీంతో పురపాలకశాఖ కొత్త పురపాలక సంఘాలు, విలీన గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది.
3,892 అక్రమ లేఅవుట్‌లు
రాష్ట్ర పురపాలక శాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి నాలుగో తేదీ వరకూ నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో అక్రమ లేఅవుట్‌లపై ప్రత్యేకంగా సర్వే చేసింది. మొత్తం 22,076 ఎకరాల్లో 3,892 అకమ్ర లేఅవుట్‌లు.. వీటిలో 2,81,171 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కొత్త పురపాలక సంఘాలు, విలీన గ్రామాలలో ఎల్‌ఆర్‌ఎస్‌కు గడువు పొడిగించారు. క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చినా పదిశాతం కూడా దరఖాస్తులు రాలేదని కూడా అధికారుల దృష్టికొచ్చింది. నిబంధనల మేరకు ఉన్న లేఅవుట్‌లు కూడా కొన్నిచోట్ల క్రమబద్ధీకరణకు దూరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
లేఅవుట్ ఎలా ఉండాలంటే...
లేఅవుట్‌లో 40 శాతం ఖాళీ స్థలాన్ని రోడ్లు, పార్కులు, ఇతర అవసరాలకు వదిలిపెట్టాలి. కనీసం పది మీటర్లు వెడల్పు ఉన్న రోడ్లు ఉండాలి. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఫీజులను చెల్లించి లేఅవుట్‌లకు అనుమతి తీసుకోవాలి. కొన్నింటిలో నిర్దేశించిన మేరకు ఖాళీ స్థలాలను వదిలిపెట్టడంలేదు. పార్కులు ఇతర అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కూడా ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. రోడ్లు నిర్దేశించిన వెడల్పు మేరకు ఉండటంలేదు. తక్కువ స్థలంలో ఎక్కువ ప్లాట్లు వేస్తున్నారు. నిబంధనలు పాటించకపోవడంతో సక్రమ, అక్రమ లేఅవుట్‌లలోని ప్లాట్ల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది.
మరో మారు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం?
రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో మరో మారు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇంకో అవకాశం ఇచ్చి తర్వాత అక్రమ లేఅవుట్‌లపై మరింత కఠినంగా ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. నగరాలు, పట్టణాల్లో 2016 డిసెంబరు 31 తర్వాత కూడా అక్రమ లేఅవుట్‌లు భారీగా వచ్చినట్లు పురపాలకశాఖ గుర్తించింది. వీటి క్రమబద్ధీకరణకు మరో అవకాశం కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇలా చేస్తే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి అవకాశం ఉంటుందని ప్రభుత్వంభావిస్తున్నట్టు సమాచారం.
ఇదీ చూడండి: కర్ణాటకలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 9 వేల కేసులు