Telangana floods 2023 : నిర్మల్ జిల్లా వరదలతో అతలాకుతలం అయ్యింది. ఒకవైపు స్వర్ణ, మరోవైపు కడెం ప్రాజెక్టుల వరదతో ముంచెత్తింది. వరద కారణంగా రహదారులు, పంటచేలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సోన్ మండలం జాఫ్రాపూర్ వద్ద వంతెన పూర్తిగా తెగిపోవడంతో.. జాఫ్రాపూర్తో పాటు గంజల్ గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
Crops Damage in telangana 2023 : భైంసా మండలంలోని దేగంలో ఇలేగాం రైతులు రాస్తారోకో చేశారు. సిరాల చెరువు తెగి తమ గ్రామ శివారులో ఉన్న పంట పొలాలు మొత్తం కొట్టుకుపోయాయని.. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద నష్టంపై కేంద్ర బృందాలు పర్యటించి.. పరిహారం ఇవ్వాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
"ఒకవైపు స్వర్ణ, మరోవైపు కడెం ప్రాజెక్టు వరదతో ముంచెత్తింది. వరద కారణంగా రహదారులు, పంటచేలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద నష్టంపై కేంద్ర బృందాలు పర్యటించి పరిహారం ఇవ్వాలి". - ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి
రేవంత్ రెడ్డిపై పోస్టర్లు.. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటూ జనజీవనం స్తంభించిన నేపథ్యంలో.. ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, తమ ప్రాంతాలలో పర్యటించలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కనబడడం లేదంటూ కంటోన్మెంట్ వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. కార్ఖానా, బోయిన్‌పల్లి ప్రాంతాలలో బస్‌స్టాప్‌లలో, ప్రధాన కూడల్ల వద్ద పోస్టర్లు అంటించారు.
Medak Rains 2023 : మెదక్‌లో అన్ని వార్డులలో రోడ్లన్నీ గుంతల మయంగా మారాయని నిరసిస్తూ రాందాస్ చౌరస్తాలో.. బీజేపీ నేతలు రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా గుండారంలో చెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వేళ.. చేపల వేటకు వెళ్లిన 52 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి పోయాడు. గమనించిన స్థానికులు వ్యక్తిని కాపాడడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.
యాదాద్రి, సూర్యాపేట జిలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గుండాలకు ఆనుకొని ప్రవహిస్తున్న బిక్కేరు వాగు కల్వర్టుపై నుంచి ప్రవహిస్తుండటంతో.. రాకపోకలుకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. హైలెవల్ వంతెన నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మోత్కూరులో వరదతో రహదారి చెరువును తలపిస్తోంది.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష.. వరద నీరు వల్ల తమ ఇళ్లు కూలిపోయే పరిస్థితి ఉందంటూ.. స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల దృష్ట్యా.. కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వదిలిన వరద నీటిని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల వద్ద.. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి కృష్ణానది వరదను ఆయన పరిశీలించారు. వరదల వేళ ఇబ్బందులు పడ్డ ఆయా ప్రాంతాల ప్రజలు.. తమకు శాశ్వత ప్రాతిపదికన ముంపు నుంచి కాపాడే పనులు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
"కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వదిలిన వరద నీటిని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలి. జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరదను సమీక్షిస్తూ ఉండాలి. ఒక్క ప్రాణం కూడా పోకూడదు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. అనుక్షణం నీటిమట్టాన్ని పరిశీలిస్తూ ఉండాలి." - శ్రీనివాస్ గౌడ్, పర్యాటకశాఖ మంత్రి
ఇవీ చదవండి: