రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రైతు సంఘాలు, అఖిల పక్ష నాయకులు ఆందోళనకు దిగారు. కార్పొరేట్లను తరిమికొట్టండి.. రైతులను కాపాడండి అంటూ నినాదాలు చేశారు. రైతులను కూలీలుగా మార్చే వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.
దేశీయ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టవద్దని, లోక్ సభ, రాజ్య సభల్లో ఆమోదించిన మూడు బిల్లులను ఉపసంహరించుకోవాలని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి కోరారు. లేనిపక్షంలో మోదీ సర్కార్ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రాలు, రైతు సంఘాలు, నిపుణులను సంప్రదించకుండా ఇంత హడావుడిగా ఏకపక్షంగా కేంద్రం... వ్యవసాయ బిల్లులు తీసుకురావాల్సిన అవసరం ఏంటని అఖిల భారత కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సభ్యుడు వేములపల్లి వెంకటరామయ్య ప్రశ్నించారు.