పురపాలక ఎన్నికల నేపథ్యంలో సన్నద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలిస్ కమిషనర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను నాగిరెడ్డి అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు జరుగుతున్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో 53 లక్షల మంది ఓటర్లు ఉండగా... ఇప్పటి వరకు 43 లక్షలకు పైగా ఓటర్లకు సంబంధించిన వార్డుల వారీ విభజన ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు వివరించారు.
బ్యాలెట్ విధానంలో ఓటింగ్...
గతంలోనే రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చినప్పటికీ మరోమారు శిక్షణ ఇవ్వాలని అధికారులను ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. గతంలో ఎన్నికల బాధ్యతలు అప్పగించిన అధికారులు బదిలీ అయినా, రిటైర్ అయినా వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని స్పష్టం చేశారు. బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరగనున్నందున గరిష్టంగా 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చూడాలని నాగిరెడ్డి స్పష్టం చేశారు.
పార్టీల ప్రాతిపదికన నిర్వహిస్తున్న ఎన్నికలైనందున బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల పేర్లు, పార్టీల గుర్తులు ఉండనున్నాయి. జనవరి 14వ తేదీన అభ్యర్థుల తుదిజాబితా ఖరారయ్యాకే బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రేపు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. సమీక్షలో డీజీపీ మహేందర్ రెడ్డి, పురపాలక శాఖ సంచాలకులు శ్రీదేవి పాల్గొన్నారు.