జీహెచ్ఎంసీ పరిధిలో వరద సాయం నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. వరద సాయం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని నిలిపివేయాలని స్పష్టంచేసింది. ఎన్నికల కోడ్ కారణంగానే వరద సాయం నిలిపివేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. అయితే మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తూ... వరద సాయంపై పార్థసారథి మాట్లాడారు. వరదసాయానికి కోడ్ అడ్డురాదని పేర్కొన్నారు. వరద బాధితుల ఖాతాల్లో వేయవచ్చని సూచించారు.
సాయం ఎలా చేస్తారు
గ్రేటర్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలా సాయం చేయడంపై పలు పార్టీలతో పాటు... స్వచ్ఛందసంస్థలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం... జీహెచ్ఎంసీ పరిధిలో వరద సాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని వెంటనే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం వరదసాయం అందించవచ్చని సూచించారు.
ఫలితాల తర్వాతే
ఇటీవల భారీ వర్షాలు, వరదలకు హైదరాబాద్‌లోనే అనేక కాలనీలు నీటమునిగాయి. బాధితులు తీవ్రంగా నష్టపోయారు. వాహనాలు, ఇళ్లలోనే సామగ్రి పూర్తిగా దెబ్బతిన్నది. దీనిప తక్షణం స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున దాదాపు రూ.500 కోట్లు పంపిణీ చేసింది. ఇంకా అనేక మంది తమకు సాయం అందలేదన్న విజ్ఞప్తుల మేరకు స్పందించిన ప్రభుత్వం... అర్హులు మీ సేవ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వాటిని పరిశీలించి నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని హామీ ఇవ్వగా.. అనేక మంది మీ-సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే ఎన్నికల కోడ్ దృష్ట్యా వరద సాయం పంపిణీ నిలుపుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఇదీ చదవండి : గ్రేటర్ పోరు.. కొద్దిసేపట్లో 'తెరాస' జీహెచ్ఎంసీ అభ్యర్థుల ప్రకటన