Vehicles Preparing For Election Campaign: ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు ప్రచార పర్వానికి వేగంగా సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ లోని పలు చోట్ల ప్రచార వాహనాలు ముస్తాబవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రాజకీయ పార్టీల నేతలు వచ్చి ప్రచారానికి అనువైన రీతిలో వాహనాలకు తయారు చేయించుకుంటున్నారు. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో వాహనాలను రీమోడలింగ్ చేసే పనులు జరుగుతున్నాయి. రోజంతా అనుచరులతో కలిసి తిరిగేందుకు, ఓటర్లకు స్పష్టంగా కనిపించేలా ప్రచార రథాలను తమ అభిరుచికి తగినట్లు సిద్ధం చేయించుకుంటున్నారు.
Telangana Election Campaign Vehicles : రెండు రోజుల క్రితం ఎలక్షన్ కమిషన్..5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో పార్టీ నాయకులు ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు . కొందరు మాత్రం ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందుగానే ప్రచార రథాలు ముస్తాబు చేసుకుని... సిద్ధంగా ఉంచుకున్నారు. ఎన్నికలలో ప్రధాన పాత్ర పోషించేది ప్రచారం.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెలన్నర మాత్రమే ఉండటంతో.. ప్రచారానికి అవసరమైన వాహనాలను వేగంగా సిద్ధం చేస్తున్నారు. ఇందిరా పార్కు సమీపంలోని ఎన్టీఆర్- మైదానం, నాంపల్లి ఎగ్జిబిషన్స్ ప్రాంతం, అంబర్ పేటలలోని ప్రత్యేక వర్క్ షాపుల్లో ప్రచార వాహనాలు సిద్ధం చేస్తున్నారు. అశోక్ నగర్లో వివిధ పార్టీల నమూనా ప్రచార వాహనాలు ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో ఇవి రెడీ కానున్నాయి.
Election Campaign Vehicles getting Ready : ఎన్నికల కోడ్ అనంతరం పార్టీలన్నీ అప్రమత్తమై వాహనదారులతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాయి. నియోజకవర్గంలో రెండు మూడు వాహనాల చొప్పున ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. ప్రతి పార్టీకీ దానికి సంబంధించిన భిన్నమైన రంగులుంటాయి. దానిని బట్టి కళాకారులు రంగులద్దుతున్నారు. ప్రతి వాహనానికి చెక్కతో ప్రచారానికి తగిన పోస్టర్లు అతికించడానికి వీలుగా వాహనం చుట్టూ చెక్కను ఏర్పాటు చేశారు. లారీ, డీసీఎం లాంటి పెద్ద వాహనాలకు ఒక వైపున డోర్ తీసేసి వెల్డింగ్ పనులు చేస్తున్నారు.
ప్రస్తుతానికి పదుల సంఖ్యలలోనే వాహనాలు వస్తున్నాయని.. మరికొన్ని రోజుల్లో వందల సంఖ్యల్లో వాహనాలు ప్రచారానికి సిద్ధం కావడానికి వస్తాయని వర్క్ షాపు యజమానులు చెబుతున్నారు. రోజూ కొన్ని వందల మంది నెల రోజుల పాటు వీటికై శ్రమించాల్సి ఉంటుంది. వివిధ పనుల చేస్తూ బతుకుతున్నవారికి ఎన్నికల సమయంలో రోజూ పని దొరుకుతుందని..వాహనాల రాక పెరిగే కొద్దీ కూలీల సంఖ్య పెంచుతామని నిర్వాహకులు చెబుతున్నారు.ఎన్నికల కోడ్ వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రచార పర్వానికి వాహనాలను సిద్ధం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో భారీగా ప్రచార వాహనాలు రోడ్డెక్కనున్నాయి.