Telangana Election Campaign in Social Media : ఎన్నికలేవైనా.. నాయకులు, కార్యకర్తల ప్రచారాలకు దీటైన వేదికలు సామాజిక మాధ్యమాలు. ఎన్నికల సమాచారాన్ని తెలిపేందుకే కాగా.. పార్టీల గెలుపోటముల్ని నిర్దేశించేస్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే.. అన్ని పార్టీలు సామాజిక మాధ్యమాల ప్రచారానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. వ్యంగ్యాస్త్రాలు, ఛలోక్తులు, నాయకుల పొరపాట్లు, గ్రాఫిక్స్ ఫొటోలు, వ్యాఖ్యానాలను పోస్టుల రూపంలో మొబైల్ ఫోన్లు నింపేస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో వేలాది గ్రూపులను ఏర్పాటు చేసి.. పార్టీల వార్తలతో హోరెత్తిస్తున్నారు. అన్నీ పార్టీల ముఖ్య నాయకులు.. నిత్యం సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటున్నారు. కార్యకర్తలూ వారి దారిలోనే.. పార్టీ విధానాల్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు.
ఆన్లైన్ ప్రచారంలో నేతలు- ఎన్నికల వ్యాపారం డీలా, గిరాకీ లేక దుకాణాలు వెలవెల!
Telangana Leaders Campaign In Social Media : పత్రికలు, టీవీలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రకటనలు ఇస్తున్నాయి. ప్రభుత్వం ఏం పనులు చేసింది..? ఇంకేం చేయబోతుందో అధికార పార్టీ వివరిస్తోంది. సర్కారు వైఫల్యాలపై విపక్షాలు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. సామాజిక మాధ్యమ సంస్థలు సైతం.. కృతిమ మేధ ద్వారా ప్రకటనల్ని ఓటర్లకు చేరుస్తున్నాయి. అన్ని పార్టీలకూ సామాజిక ప్రచార విభాగాలు పనిచేస్తుండగా.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరింత బలోపేతం చేశారు. బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీలు సామాజిక మాధ్యమాల వినియోగాన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి.
Telangana Assembly Elections 2023 : ప్రత్యర్థి పార్టీల వైఖరి, వైఫల్యాలతో పాటు మేనిఫెస్టోలను ఆకట్టుకునేలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. సందేశాలు, ప్రత్యేక గీతాలు, ఆకట్టుకునే ఫోటోలు, వీడియోలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తంగా.. అందరి లక్ష్యం తటస్థ ఓటర్లే.. ఏ పార్టీలకు సంబంధం లేకుండా స్థిరంగా ఉండే వాళ్లని ఎవరు తమ వైపునకు తిప్పుకుంటే వాళ్లదే విజయం. అందుకే.. అన్నీ పార్టీలకు ఇప్పుడు తటస్థులను ఆకర్షించడం పనిగా మారింది. ఇందుకు ప్రత్యర్థుల తప్పొప్పులను వివరించడం, తాము గెలిస్తే.. చేయబోయే పనుల ప్రణాళికలను సోషల్ మీడియా ద్వారా వివరిస్తున్నారు.
Social Media Campaign : పార్టీల ప్రచారం ఉద్ధృతిలో.. భారీగా తప్పుడు వార్తలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఎవరికి నచ్చినట్లు వాళ్లు.. తప్పుడు వార్తలను సృష్టిస్తూ రెచ్చిపోతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే సర్వే ఫలితాలతో పాటు వార్తా మాధ్యమాల లోగోలతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేలా ఏవో వార్తలు ప్రసారం అవుతున్నట్లు.. గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. పోస్టులు పెట్టేటప్పుడు సాధారణ ప్రజలు సులువుగా నమ్మేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తప్పుడు వార్తల కారణంగా.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. ఫేక్ లెటర్లు, వీడియోలు రూపొందించి నెట్టింట్లోకి వదులుతున్నారు. దీనిని.. ప్రత్యర్థి పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా పోటా పోటీగా ఎన్నో ఫేక్ వార్తలు సామాజిక మాధ్యమాల్ని ఊదరగొడుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వొచ్చు. ఎంతమంది చూశారు.. వారి స్పందన కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అందుకే పార్టీలన్నీ డిజిటల్ ప్రచారం చేస్తున్నాయి.
ప్రచారంలో నయా రూట్ - ఏఐ టెక్నాలజీతో ఖర్చు తగ్గించుకుంటున్న అభ్యర్థులు
సోషల్ మీడియాపై రాజకీయ పార్టీల ఫోకస్ - ఫాలోవర్స్ ఎక్కువున్న వారి పంట పండినట్టే