Telangana Election Campaign in Social Media 2023 : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని.. పార్టీ హామీలను ప్రజల్లోకి ప్రతిరోజూ విస్తృతంగా తీసుకెళ్లేందుకు తాము చేసే అన్ని కార్యక్రమాలపై వీడియోలు చేసేలా అభ్యర్థులు ఈవెంట్, కంటెంట్, క్రియేటివ్ నిపుణులను నియమించుకుంటున్నారు. ఈ వీడియోలను ప్రజల వద్దకు చేర్చేందుకు.. సోషల్ మీడియాల్లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న బృందాలు, వాటి అడ్మిన్లను గుర్తిస్తున్నారు. తమకు అనుకూలంగా ప్రచారం చేసేలా వారితో మాట్లాడుకుంటున్నాయి. అభ్యర్థులైతే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల వరకు, పార్టీలైతే అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల వరకు పనిచేసేలా ఒప్పందాలు ఖరారు చేసుకుంటున్నాయి.
Telangana Leaders Election Campaign in Social Media : అసెంబ్లీ ఎన్నికల వరకైతే రూ.2-3 లక్షలు, లోక్‌సభ ఎన్నికలు కలిపితే రూ.5 లక్షల వరకు మాట్లాడుకుంటున్నారు. ఫాలోవర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లైతే.. ఆ మేరకు ఒప్పంద విలువనూ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒప్పందాల కోసం పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. పలు నిరుద్యోగ, కుల, స్నేహితుల, యువజన తదితర వేదికల గ్రూపులు గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో ఉన్నాయి. యువకులు అత్యధికంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉద్యోగ సమాచారాన్ని పంచుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆయా గ్రూపుల అడ్మిన్‌లతో మాట్లాడుకుని వాటిని రాజకీయ నాయకులు తమ పరిధిలోకి తీసుకునేలా చర్చిస్తున్నట్లు సమాచారం. తన నియోజకవర్గం వరకు అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్నట్లైతే.. రూ.1-2 లక్షల వరకు చెల్లిస్తామంటూ బేరాలడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్)లో ఎక్కువ మంది ఫాలోవర్లున్న వ్యక్తులను తమ ఖాతాలను ఫాలో చేయాలని.. తమ వీడియోలను అప్‌లోడ్ చేయాలని కోరుతున్నారు.
మీమ్స్‌తో చేయిద్దాం.. మిరాకిల్స్! : రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థులను ఖంగు తినిపించేందుకు చాలా మంది అభ్యర్థులు సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా ప్రత్యేకంగా పొలిటికల్ మీమర్స్‌ను నియమించుకుంటున్నారు. సినిమాల్లోని ప్రఖ్యాత డైలాగ్‌లు, సన్నివేశాలు, వైరల్‌గా మారిన వీడియోలను.. ప్రముఖ సినీ హాస్యనటుల హావభావాలున్న ఫొటోలను వాడిస్తూ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, ప్రత్యర్థుల విధానాలను పోల్చుతూ వారితో మీమ్స్ చేయిస్తున్నారు. ఉదాహరణకు ఏదైనా పార్టీ నేతలు బహిరంగ సభల్లో ఇచ్చిన హామీలను.. గతంలో అవలంభించిన విధానాల్లోని లోపాలను ఎత్తి చూపే విధంగా చేస్తున్నారు. ఈ తరహా మీమ్స్ జనాల్లోకి ఎక్కువగా వెళ్లే ఆస్కారం ఉండటంతో.. ప్రత్యర్థులు నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు అదే స్థాయిలో మరిన్ని పోస్టులు పెట్టిస్తున్నారు.
మీమర్స్‌కు నెలవారీ వేతనాలు : హైదరాబాద్ నగర చుట్టుపక్కల మీమర్స్ వేర్వేరు పార్టీలు, అభ్యర్థుల కోసం పని చేస్తున్నారు. నాయకులు మూడు నెలల ముందుగానే వీరిని నియమించుకుని.. వారికి నెలవారీ వేతనాలు ఇస్తున్నారు. వీరిలో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు, నిరుద్యోగులే ఎక్కువగా ఉండడం విశేషం. తమకు పాకెట్ మనీ లభిస్తోందని.. ఉద్యోగ వేటలో ఇవి వారికి పనికొస్తాయని చెబుతున్నారు మీమర్స్.