Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల ప్రచారసరళిని చూస్తే.. ఎన్నికల్లో అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ బీఆర్ఎస్.. ప్రచారంలోనూ ఇతరులకంటే కాసింత ముందంజలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), కేటీఆర్, హరీశ్‌రావు మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. ఆ ప్రగతి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించాలనే విషయాన్ని అర్ధమయ్యేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
BRS Election Campaign 2023 : బీఆర్ఎస్ అభ్యర్థులంతా నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో రైతులు, కూలీలు, మహిళా, యువజన, కుల సంఘాలతో సమావేశమై.. చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. నగరాల్లో, పట్టణాల్లో.. వివిధ యూనియన్ల, బస్తీల్లో స్థానికులు, కాలనీల బాధ్యులతో సమావేశం అవుతున్నారు. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ సమావేశమవుతూ ఇళ్లకు నిరంతర విద్యుత్తు, ఉచిత తాగునీరు, తగ్గించిన ఇంటి పన్నులు, స్థలాల క్రమబద్ధీకరణ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు.. తదితరాలను గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను వ్యక్తిగతంగా కలుస్తున్నారు. మరోసారి దీవించాలని కోరుతున్నారు.
BRS Election Campaign in Social Media : సామాజిక మాధ్యమ ప్రచారానికి బీఆర్ఎస్(BRS) పెద్దపీట వేస్తోంది. నియోజకవర్గాల్లో సామాజిక మాధ్యమ బృందాలను ఏర్పాటు చేస్తోంది. ప్రతి బూత్ పరిధిలో ఉన్న ఓటర్లందరితో కలిపి వాట్సాప్ గ్రూప్‌లను ప్రారంభిస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు? ఏ పథకం ఎవరికి ఉపయోగపడుతుంది? మహిళల కోసం ప్రభుత్వం ఏం చేసింది? మళ్లీ అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తుందో.. వీటి వివరాలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని పరిస్థితులను తెలిసే విధంగా పోస్ట్‌లు చేస్తున్నారు.
Telangana Congress Election Campaign 2023 : ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్(Congress) ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో రేసు గుర్రాల జాబితా వెల్లడి కాసింత ఆలస్యం అయినా.. ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై భారీగా ఆశలు పెట్టుకుంది. పార్టీ ప్రచారంలో ఎక్కువగా నాయకులందరూ ఈ ఆరు గ్యారెంటీలపైనే మాట్లాడుతున్నారు. పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో తమ అగ్రనేత సోనియాగాంధీతో ఆరు గ్యారెంటీల కార్డులను కాంగ్రెస్ నేతలు విడుదల చేయించారు. మరుసటిరోజు నుంచే నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
Political Heat in Khammam District : ఖమ్మంలో రాజుకుంటున్న రాజకీయం... ప్రచారాలు ప్రారంభించిన నేతలు
ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్(బీఎల్‌ఏ)లుగా ఇద్దరికి శిక్షణ ఇచ్చారు. వీరికితోడుగా మరికొందరిని నియమించారు. వారికి 1000 మందితో కూడిన ఓటరు లిస్ట్‌ను ఇచ్చారు. ఈ మేరకు వారిద్దరూ ఇంటింటికీ వెళ్లి ఆరు గ్యారెంటీల కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఈ సమయంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికైతే ప్రభుత్వ పథకాలు అందడం లేదో వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 20 వేల కార్డుల చొప్పున అన్ని నియోజకవర్గాలకు పంపి, మిగతా కార్డులను అభ్యర్థులు అవసరం మేరకు వినియోగించాలని పార్టీ సూచిస్తోంది.
BJP Election Campaign in Telangana : అభ్యర్థుల ఖరారులో మిగిలిన పార్టీలకంటే వెనుకంజలో ఉన్నా.. అగ్రనేతల సభలు, జాతీయ నేతల సమావేశాలు, అంతర్గత కార్యాచరణతో బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు 53 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంతో ఆయాచోట్ల ప్రచారం మొదలైంది. అభ్యర్థిత్వాలు ఖాయమనుకున్న నేతలు 20 రోజుల నుంచి నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. కీలక నియోజవర్గాల కేంద్రంగా బీజేపీ ప్రచారం సాగుతోంది. ర్యాలీలకూ ప్రాధాన్యం ఇస్తున్నారు.
CM KCR Vs Revanth Reddy in Kamareddy : నువ్వా నేనా.. కామారెడ్డిలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి?
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రచార అస్త్రాలను సంధిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో జనగర్జన సభతో ప్రధాని మోదీ(PM MODI) ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రధాని తన సభల్లో పసుపుబోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటనలు చేశారు. ఎన్డీఏలో చేరుతామని సీఎం కేసీఆర్ తనతో చర్చించారని, కేటీఆర్‌ని సీఎం చేస్తానని చెప్పినట్లు నిజామాబాద్‌లో వెల్లడించి సంచలనం సృష్టించారు. సూర్యాపేట, ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభలు నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అమిత్ షా ప్రకటించారు. దీన్నే శాననసభ ఎన్నికల్లో తమ ప్రధాన అంశంగా మార్చుకుని బీజేపీ ముందుకు సాగుతోంది.