హైదరాబాద్ నగరానికి సంబంధించిన రహదార్లు, ఉద్యానవనాలు, చెరువులు, రవాణా తదితర రంగాల అభివృద్ధి కోసం నిర్మాణ నమూనాలను అందించాలని హాంకాంగ్‌కు చెందిన ఏఈకామ్ కంపెనీ ప్రతినిధులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి కోరారు. కంపెనీ ప్రతినిధుల బృందం సచివాలయంలో శుక్రవారం సీఎస్ జోషిని కలిసింది. నగర ప్రణాళిక, ట్రాఫిక్ నిర్వహణ, ఉద్యోగావకాశాలు, చెరువుల సుందరీకరణ, సివిల్ సదుపాయాలు, నిర్మాణ నమూనాలు రవాణా తదితర అంశాలపై చర్చించారు.
ఐటీ హబ్‌గా అభివృద్ధి
భాగ్యనగరానికి చారిత్రాత్మక నేపథ్యం ఉందని... మంచి వాతావరణంతో ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతోందని సీఎస్ ఏఈకామ్ ప్రతినిధులకు వివరించారు. పట్టణ రంగానికి సంబంధించిన సలహాలు, వ్యవస్థల సంస్కరణల కోసం సూచనలు, శిక్షణా కార్యక్రమాలు అందించాలని హాంకాంగ్ ప్రతినిధులను ఆయన కోరారు. నగరాలకు సంబంధించిన బృహత్ ప్రణాళికల నమూనాల రూపకల్పనలో ఏఈకామ్ సంస్థకు మంచి అనుభవం ఉందని... వారి సలహాలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయన్న ఏఈకామ్ సంస్థ అధ్యక్షుడు సియాన్ చియావో... అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నమూనాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇదీ చూడండి : స్నేహితులతో కలిసి పెద్దమ్మ ఇంటికి కన్నం