తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనల్లో ప్రాణాంతకంగా మారిన వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ తరహా 12 ఉల్లంఘనల కింద గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 99,23,900 కేసులు నమోదు చేశారు. కోటికి చేరువైన ఈ ఉల్లంఘనల్లో శిరస్త్రాణం లేని కేసులే దాదాపు 73 శాతం ఉండటం ఆందోళనకరంగా మారింది.
ఒక్క హైదరాబాద్ కమిషనరేట్‌లో గత ఏడాది 2,493 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 951 మంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు కారకులయ్యారు. అలాగే 1,281 మంది ద్విచక్రవాహనదారులు మృతులు లేదా క్షతగాత్రులుగా మారారు. ఈ ఉదంతాల్ని పరిశీలిస్తే చాలు రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారుల పాత్ర ఎంత ఉంటుందో అర్థంచేసుకోవచ్చు.
ప్రమాదాలు జరుగుతున్నా.. తగ్గని దూకుడు
- ప్రాణాంతక ఉల్లంఘనల్లో అధికవేగం కేసులు రెండోస్థానంలో నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా 65 స్పీడ్ లేజర్ గన్‌లతో వాహనాల వేగాన్ని కొలుస్తూ పరిమితికి మించి వెళ్తే.. కేసులు నమోదు చేస్తున్నారు.
దారికొస్తున్న మందుబాబులు
- గతంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారి వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగేవి. డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీల్ని నిరంతర ప్రక్రియగా మార్చడంతో మందుబాబులు దారికొస్తున్నారు. 2019లో మొత్తం ప్రాణాంతక ఉల్లంఘనల్లో ఈ తరహా కేసులు ఒక్క శాతమే నమోదు కావడం గమనార్హం.
ఇవీ చూడండి: సీఏఏను రద్దు చేయాలని మంత్రివర్గ తీర్మానం