Congress Deeksha: రాష్ట్రంలో రైతు సమస్యల కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వడ్ల కొనుగోలు విషయంలో జాప్యంతో అన్నదాతలు అవస్థలు పడుతుంటే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం నెట్టుకుంటున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్(Congress Deeksha)... ఆందోళనను తీవ్రతరం చేస్తోంది. భాజపా, తెరాస వైఖరిని ఎండగడుతూ ఇటీవల హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది.
దీక్షాస్త్రం...
తర్వాత కల్లాల్లోకి కాంగ్రెస్ పేరుతో క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచింది. ఆ తర్వాత మండల, జిల్లా స్థాయిలో నిరసనలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు ఇచ్చింది. తాజాగా రెండ్రోజుల దీక్షాస్త్రాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సంధించేందుకు కాంగ్రెస్ (Telangana Congress) సిద్ధమైంది. ఇవాళ, రేపు ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ రైతు దీక్ష చేపడుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Pcc Chief Revanth Reddy), సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సహా ఇతర ముఖ్యనేతలు దీక్షలో పాల్గొననున్నారు.
బహిరంగ లేఖ...
ముఖ్యమంత్రి కేసీఆర్... దిల్లీ పర్యటనపై ఘాటుగా స్పందించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... తెలంగాణ సమాజానికి బహిరంగలేఖ రాశారు. తెరాస, భాజపాల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న రేవంత్ రెడ్డి.... ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే దిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టాలని డిమాండ్ చేశారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లోని ప్రతిగింజను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేవరకు పోరాటం ఆగదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చూడండి: