T Congress Seniors meets Digvijay Singh: రాష్ట్ర కాంగ్రెస్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్ఠానం చర్యలు ముమ్మరం చేసింది. ట్రబుల్ షూటర్‌గా పేరున్న ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దించగా... రాష్ట్ర నేతలతో ఆయన గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. పీసీసీని వ్యతిరేకించిన సీనియర్ నేతలతో... ఒక్కొక్కరితో వేర్వేరుగా చర్చిస్తున్నారు. వీ.హనుమంతరావు, మల్లు రవి, శ్రీధర్‌బాబు, మహేష్ కుమార్ గౌడ్ , ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితర నేతలు గాంధీభవన్‌కు చేరుకున్నారు. రాత్రి 8 గంటల వరకు దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర నేతలకు సమయం కేటాయించారు.
పార్టీలో ఉత్పన్నమవుతున్న సమస్యలకు పరిష్కారం, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చించనున్నారు. నాయకులంతా ఏకతాటిపై నడిచేందుకు ఏం చేస్తే బాగుంటుందని వారి నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. సామాజిక మాధ్యమాల్ల్లో పోస్టులు పెడుతూ సీనియర్లను అవమానపరుస్తున్న వైనం, కొందరు నాయకులు కోవర్టులుగా పని చేస్తూ... పార్టీని దెబ్బతీస్తున్నట్లు సీనియర్ నాయకులు ఆరోపించారు. ఈ అంశంపై కూడా దిగ్విజయ్‌సింగ్ చర్చించనున్నారు.
పీసీసీ వ్యతిరేకవర్గంతోపాటు... ఇటీవల పార్టీ పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డితోపాటు... పలువురు నేతల్ని దిగ్విజయ్ సింగ్ కలవనున్నారు. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, సురేష్ షట్కర్, బలరాం నాయక్‌లు దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను వివరించనున్నారు. చర్చల అనంతరం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇంఛార్జి మాణికంఠాగూర్‌తో కూడా మాట్లాడి... అధిష్ఠానానికి నివేదిక ఇవ్వనున్నారు. సాయంత్రం అనుబంధ సంఘాల నేతలతోనూ దిగ్విజయ్‌సింగ్ సమావేశమవుతారు.
దిగ్విజయ్ సింగ్‌ను కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి: నిన్న హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌తో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ట హోటల్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఆయనను కలిశారు. ఇవాళ గాంధీభవన్‌లో జరిగే సమావేశానికి అందుబాటులో ఉండడం లేదన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి... అందువల్లే ఒక రోజు ముందుగానే దిగ్విజయ్ సింగ్‌ను కలిసినట్టు తెలిపారు. 2018 తర్వాత పార్టీలో నెలకొన్న పరిణామాలు... గత 20 నెలలుగా పార్టీ పరిస్థితులపై దిగ్విజయ్‌సింగ్‌కు వివరించానని ఆయన తెలిపారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను చక్కదిద్దేందుకు దిల్లీలో నిన్న ఉదయమే దిగ్విజయ్ రంగంలోకి దిగారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత సీనియర్లు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలతోపాటు ఇటీవల నియమించిన కమిటీల గందరగోళం వరకు జరిగిన పరిణామాలపై చర్చించారు.
ఇవీ చదవండి: