Telangana Congress MLA Candidates Second List 2023 : రాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అధిష్ఠానానికి కత్తి మీద సాములా మారింది. గత ఆదివారం 55 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన ఏఐసీసీ.. మిగిలిన 64 స్థానాలపై సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. శనివారం దిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, సభ్యులు దాదాపు నాలుగు గంటలు సమావేశమయ్యారు. అయినా చాలా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. తొలి జాబితాలో ప్రకటించిన 55 మందిలో పార్టీలోకి కొత్తగా వచ్చిన 12 మందికి టికెట్లు దక్కడం, సర్వేల్లో మెరుగైన ఫలితాలు ఉన్నా.. ఇతరులకు కేటాయించడం, గెలుపు గుర్రాలంటూ పార్టీ కోసం పని చేస్తున్న వారిని నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలను ఏఐసీసీ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.
సామాజిక సమీకరణాలు.. తాజా రాజకీయ పరిణామాలు, ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థుల బలాబలాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని.. పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కానీ చాలా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉన్నా.. అధికార బీఆర్ఎస్ను సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో లేకపోవడంతో బయట పార్టీల నుంచి బలమైన నాయకుల కోసం పీసీసీ ఆసక్తి కనపరుస్తోంది. ఇప్పటికీ చాలా చోట్ల బలమైన అభ్యర్థులు లేరన్న వాదన పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రెండో జాబితా ప్రకటనపై పార్టీ లోతుగా విశ్లేషిస్తోంది.
సూర్యాపేటలో దామోదర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఒక వర్గం.. పటేల్ రమేశ్ రెడ్డికి కేటాయించాలని మరో వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వనపర్తి, ఎల్బీనగర్, ఖైరతాబాద్, అంబర్‌పేట్, జూబ్లీహిల్స్, మునుగోడు, హుస్నాబాద్, నిజామాబాద్ అర్బన్ తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక.. ఏఐసీసీకి తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. అక్కడ గట్టి పోటీ ఉండటంతో టికెట్ కోసం పట్టుబడుతూ సర్దుబాటు చేసుకొని ముందుకెళ్లే పరిస్థితులు ఆయా నాయకుల్లో లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరగాలంటూ ఓ వర్గం.. సీనియారిటీకి పెద్ద పీట వేయాలని మరో వర్గం పట్టుబడుతున్నట్లు సమాచారం.
కొత్తగా పార్టీలోకి వస్తున్న వారికి టికెట్లు ఇవ్వడంపై స్క్రీనింగ్ కమిటీ నాయకులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వామపక్షాలు కాంగ్రెస్‌తో పొత్తు కుదిరినా.. అభ్యర్థుల సర్దుబాటు కొలిక్కిరాలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, ఖమ్మం జిల్లాలో వైరా, కొత్తగూడెం, చెన్నూరు టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నా.. వామపక్షాలు ఇతర సీట్ల కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెచ్చేందుకు ఇవాళ మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాలని భావిస్తోంది.
Revanth Reddy Fires on CM KCR : 'బీఆర్ఎస్ మరో 45 రోజులే.. ఆ తర్వాత మేమే అధికారంలోకి వస్తాం'
వామపక్ష పార్టీలతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. మాట్లాడుతున్నారు. త్వరలోనే సీట్ల సర్దుబాటు తేలుతుంది. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటో తెలుసు. వాళ్లకు పూర్తి స్థాయిలో అభ్యర్థులు లేరు. ఈ విషయం వాళ్లకీ తెలుసు. కాంగ్రెస్ సైతం బీసీలకు అధికంగానే సీట్లు ఇస్తుంది. బీఆర్ఎస్ కంటే ఎక్కువగానే ఇస్తాం. - మాణిక్‌రావు ఠాక్రే, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జీ