ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా కాంగ్రెస్ ఇచ్చిన ప్రగతిభవన్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద నిన్న రాత్రి నుంచి భారీగా పోలీసులు మొహరించి... వారిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ముఖ్యనేతలను గృహ నిర్బంధం చేయగా... మరికొందరిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అదుపులోకి తీసుకున్న పోలీసులు... నగరంలో గంటపాటు తిప్పి తిరిగి బంజారాహిల్స్‌లోని ఆయన ఇంట్లోనే పోలీసులు వదిలేశారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు మొహరించారు. ముట్టడికి పిలుపునిచ్చిన కీలక వ్యక్తి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కావడం వల్ల ఆయన ఇంటిని తెల్లవారు జాము నుంచి పోలీసులు చుట్టుముట్టారు. కానీ ఆయన ఇంట్లో లేరని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటుండగా... ఇంట్లోనే ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు అక్కడే మకాం వేశారు... అయినప్పటికీ రేవంత్ పోలీసుల పహార నుంచి తప్పించుకుని ద్విచక్ర వాహనంపై ప్రగతి భవన్ వైపుకు బయల్దేరారు. అప్రమత్తమైన పోలీసులు రేవంత్‌ను అరెస్ట్ చేశారు.
భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబీర్ అలీ, పొన్నం ప్రభాకర్‌లను హౌస్ అరెస్ట్ చేశారు. పొన్నాల లక్ష్మయ్య తన ఇంట్లోనే నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. అదే విధంగా జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చి ముట్టడి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్న నేతల ఇళ్లను పోలీసులు చుట్టు ముట్టి హౌస్ అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి: పోలీసుల సంక్షేమానికి తగిన చర్యలు: అమిత్ షా