Telangana Congress Joinings 2023 : ఓవైపు అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తూనే కాంగ్రెస్.. మరోవైపు పార్టీలో నేతల చేరికల్లో జోరు పెంచింది. ఏఐసీసీ ఆదేశాలతో నేతల్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. దిల్లీలో మూడు రోజులపాటు జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో నియోజక వర్గాల వారీగా చర్చల్లో ఎక్కడ బలమైన నాయకులున్నారు? ఎక్కడ లేరు? అనే విషయాల్ని గుర్తించినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతలు బలంగా ఉన్న స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీల నుంచి తీసుకోరాదని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పలువురు నాయకులు వచ్చేందుకు చొరవ చూపినా.. సున్నితంగా తిరస్కరించారు. స్క్రీనింగ్ కమిటీలో చర్చించిన తరువాత దాదాపు 15 నియోజక వర్గాలల్లో బీఆర్ఎస్ దీటుగా ఎదుర్కొనే నేతలు లేరని గుర్తించారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి బలమైన నాయకుల్ని చేర్చుకోవాలని నిర్ణయించారు..
MLA Mynamapally Joins Congress 2023 : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు..బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారు. తనతో పాటు కుమారుడు రోహిత్ కలిపి మల్కాజిగిరి, మెదక్ టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఆయన చేరికకు పీసీసీ స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దృష్టికి విషయం తీసుకెళ్లగా.. మైనంపల్లికి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాదరణపై సర్వేలు చేశారు. అందుకు అనుగుణంగా పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ స్థాయిలో పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. కొత్తగా పార్టీలో చేరేవారికి ఐదేళ్ల వరకు ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వరాదని ఉదయపూర్ డిక్లరేషన్ ఉంది. ఈ తీర్మానాన్ని పక్కనపెట్టి మెదక్‌తో పాటు మల్కాజిగిరి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ముందుకు వచ్చినట్లు సమాచారం. దీంతో రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు మైనంపల్లి ప్రకటించారు.
Kumbham Anil Rejoined in Congress : భువనగిరి మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన ఆయన అనూహ్యంగా మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని కుంభం అనిల్ నివాసానికి వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. ఆ తరువాత అనిల్ కుమార్‌కు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి ఆహ్వానించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు అనిల్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకున్నట్లు స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి...పీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని అనిల్ కుమార్ రెడ్డి విజయవంతం చేశారని కొనియాడారు.
''భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ సర్వేలు నిర్వహించింది. కుంభం అనిల్ రెడ్డిని తిరిగి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని సర్వే కమిటీ నిర్ణయించింది. దానికి అనుకూలంగా అనిల్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం జరిగింది.'' - రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ నాయకుడు కూడా చొరవచూపుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక కాంగ్రెస్ నాయకులతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మైనంపల్లి ఇంటి వద్దకు వెళ్లే ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్కాజిగిరి సీటు కోల్పోనున్న నందికంటి శ్రీదర్ ఇంటికి వెళ్లి బుజ్జగించారు. అయినప్పటికీ మైనంపల్లి చేరికపై స్పందించిన నందికంటి శ్రీధర్ .... ఏదేమైనా తాను మల్కాజ్ గిరి నుంచే పోటీచేస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
Congress Ticket War in Palamuru : ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ టికెట్ దక్కించుకునేదెవరు..?