Priyanka Gandhi Telangana Tour: రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై సమరభేరి మోగించడం ద్వారా యువతను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు పీసీసీ ప్రణాళికలు సిద్దం చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చెందిన ప్రశ్నాపత్రాలు లీక్ కావడంపై... కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది. విశ్వవిద్యాలయాలల్లో నిరుద్యోగ నిరసన దీక్ష సభలు ఏర్పాటు చేయాలని పీసీసీ పేర్కొంది.
Priyanka Gandhi Telangana Tour news : ప్రధానంగా టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ వల్ల తీవ్రంగా నష్టపోతున్న యువతకు భరోసా కల్పించేట్లు కాంగ్రెస్ పోరాటం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రశ్నపత్రాలు ఏ విధంగా లీక్ అయ్యాయి...? అందుకు బాధ్యులు ఎవరు..? అన్న కోణంలో యువతకు వివరించి.. తద్వారా ఓటర్లను తమవైపు ఆకర్షితులను చేసుకునే దిశలో కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తోంది.
మే మొదటివారంలో రాష్ట్రానికి ప్రియాంక గాంధీ: ప్రధానంగా నిరుద్యోగుల సమస్య, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై టీపీసీసీ ఉద్యమం చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 21న నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపడతామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. అదేవిధంగా మే 4 లేదా 5న హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో భారీ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ప్రియాంక గాంధీని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తుండడంతో... అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
మే 9 నుంచి రేవంత్ రెండో విడత పాదయాత్ర: అర్ధాంతరంగా నిలిచిపోయిన పాదయాత్రను తిరిగి మొదలు పెట్టేందుకు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. మే 9వ తేదీ నుంచి రెండో విడత హాథ్ సే హాథ్ జోడో యాత్రను 32 నియోజక వర్గాల్లో నిర్వహిస్తామన్నారు. జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సీబీఐ విచారణకు ఆదేశించండి: ఇప్పటికే ఆందోళనలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి... పేపర్ లీక్ వ్యవహారంపై పోరాటాన్ని వేగవంతం చేసింది. సిట్ విచారణపై నమ్మకం లేదని... సీబీఐకి కానీ, సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే విచారణ చేపట్టిన న్యాయస్థానం... సిట్ దర్యాప్తునకు సంబంధించి పూర్తి వివరాలు తమకు నివేదించాలని ఆదేశించింది.
మరోవైపు కలిసొచ్చే పార్టీలను, ప్రజా సంఘాలను, విద్యార్ధి సంఘాలను కలుపుకుని ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే పేపర్ లీక్ వ్యతిరేక కమిటీ నేతృత్వంలో ఇందిరా పార్కు వద్ద చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్షలో పెద్ద ఎత్తున నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ గళం వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపట్ల దుయ్యబట్టిన నాయకులు... సిట్ విచారణపై విశ్వాసం లేదని సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: