కరోనా పట్ల రాష్ట్ర ప్రజల ఆందోళనలను వినిపించేందుకు 'స్పీకప్ తెలంగాణ' పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఆన్‌లైన్ ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కరోనా పరిస్థితులు, ప్రజల ఆరోగ్యం, విద్యా సమస్యలపై చర్చించేందుకు జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గడిచిన 13 రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడకపోవడం దురదృష్టకరమని, ఆయన ఎక్కడ ఉన్నారో ప్రజలకు తెలియడం లేదని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
శనివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఏకకాలంలో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి సూచనలను, సలహాలు తెలియజేయడానికి ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడానికి నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : 'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'