T-Congress Focus on Joinings : రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారు బలమైన నాయకులను బరిలో దించే దిశగా దూసుకెళ్తుండటంతో అభ్యర్థుల మధ్య నువ్వా-నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని బీఆర్‌ఎస్.. తెలంగాణాలో అధిక సీట్లు దక్కించుకుని దక్షిణాదిన పాగా వేయాలని బీజేపీ, కర్ణాటక ఫలితాలను తెలంగాణలో రిపీట్ చేయాలని కాంగ్రెస్.. ఇలా ఎవరికి వారు విజయంపై ధీమాతో ఉన్నారు.
T-Congress Focus on ReJoinings : ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లి అక్కడ ఇమడలేక ఇబ్బందులు పడుతున్న నాయకులను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. 'ఘర్ వాపసీ' పేరుతో వారిని పార్టీలోకి చేర్చుకుని.. తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పార్టీలో చేరికల విషయంలో పార్టీ అధిష్ఠానం రేవంత్ రెడ్డికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అటు అధికార బీఆర్‌ఎస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు కూడా తమ నాయకుల కదలికలపై నిఘా పెట్టి ఉంచాయి.
పలువురు టచ్‌లోకి.. : అధిష్ఠానాలు ఎంత నిఘా ఉంచినా.. ఇప్పటికే బీఆర్‌ఎస్, బీజేపీల్లోని పలువురు అసంతృప్త నేతలు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ రెండు పార్టీల నుంచి ముఖ్య నాయకులను హస్తం పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఆయా పార్టీలను బలహీనపర్చడంతో పాటు తమ పార్టీనే బలమైనదన్న సంకేతాలను జనంలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది.
ఓకే చెప్పిన ఆ ఇద్దరు.. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. అదేవిధంగా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతోనూ మంతనాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఓ ఎమ్మెల్సీ, ఆయన కుమారుడు కూడా కాంగ్రెస్‌లోకి రావడానికి మొగ్గు చూపుతుండగా.. వారు అడుగుతున్న సీట్లు సర్దుబాటు చేసే పనిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరితో పాటు హైదరాబాద్ నగరానికి చెందిన కొందరు నాయకులతోనూ కాంగ్రెస్ పార్టీ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీలైనంత ఎక్కువ మందిని ఆ రెండు పార్టీల నుంచి 'ఘర్ వాపసీ' ద్వారా ఆహ్వానించాలని పీసీసీ నిర్ణయించింది.
ఇదిలా ఉండగా.. ఎన్నికలకు 6 నెలల ముందే సగం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహిస్తున్న పీసీసీ.. వివాదాలు లేని బలమైన నాయకులను బరిలో దింపుతున్నట్లు ముందస్తుగా ప్రకటించాలనే దిశలో ముందుకు సాగుతోంది.
ఇవీ చూడండి..