Telangana Congress MLA Ticket Applications : రాష్ట్రంలో ఇప్పటి వరకు తామే అభ్యర్థులమంటూ ఎవరైనా చర్చించుకున్నా.. అవన్నీ ఊహాగానాలే అవుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎవ్వరిని అభ్యర్థులుగా ప్రకటించలేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ (Telangana Congress) అభ్యర్థుల కోసం.. నమూనా దరఖాస్తును గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మధుయాస్కీ, అంజన్‌కుమార్ యాదవ్, ఇతర నేతలు విడుదల చేశారు.
T Congress Assembly Ticket Application To Begin : ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.25,000.. బీసీ, ఓసీ అభ్యర్థులకు రూ.50,000 దరఖాస్తు రుసుము నిర్ణయించినట్లు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు నుంచి ఈనెల 25 వరకు వీటిని స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు.. వచ్చిన దరఖాస్తులను ( MLA Ticket Applications) పరిశీలిస్తాయని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
అర్జీలు ఇచ్చిన అభ్యర్థులు.. వారు పార్టీకి చేసిన సేవలు, సర్వేలు, గెలుపు ప్రాతిపదికన నివేదిక తయారు చేస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. దీనిని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్దారించిన తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఫైనల్ అయినట్లు మీడియాలో వచ్చే కథనాలను నమ్మొద్దని సూచించారు. గతంలో హామీ ఇచ్చారని.. జరిగే ఊహాగానాలకు తావు లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ నేతలెవరైనా.. తనతో సహా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని పునురుద్ఘాటించారు. నమూనా దరఖాస్తును ఆన్‌లైన్‌లోనూ తీసుకోవచ్చని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
"ఎమ్మెల్యే టికెట్ ఆశావాహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులను స్వీకరిస్తాం. అర్జీల స్వీకరణ తర్వాత అర్హులైన వారికి సర్వేలు చేయిస్తాం. తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ వడపోసిన జాబితాను స్క్రీనింగ్ కమిటీకి పంపుతాం. స్క్రీనింగ్ కమిటీ తర్వాత కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటికీ పంపుతుంది. అక్కడ కూడా అభ్యర్థి ఎంపిక మెలికబడితే సీడబ్ల్యూసీకి పంపుతారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. పీసీసీ , సీఎల్పీలు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందే. నమూనా దరఖాస్తును ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
మరోవైపు తన భద్రత అంశంపై రేవంత్‌రెడ్డి స్పందించారు. కోర్టు చెప్పినా తనకు భద్రత కల్పించడం లేదని విమర్శించారు. ఎంపీగా, పీసీసీ చీఫ్‌గా ఉన్న తనకు భద్రత తొలగిస్తారా అని ప్రశ్నించారు. తాను ప్రజల మనిషిని అని సెక్యూరిటీతో పనిలేదని వివరించారు. భద్రత లేకుండా ఎక్కడికైనా వెళ్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భద్రత లేకుండా ఓయూ, కేయూకి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తారా? అని రేవంత్‌రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ హయాంలో కేసీఆర్‌కు తగినంత భద్రత కల్పించారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ తొత్తులైన అధికారుల పేర్లు రెడ్ బుక్‌లో రాస్తామని.. అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కోకాపేట్, బుద్వేల్ భూములు కొన్నది కేసీఆర్ బినామీలేనని విమర్శించారు. లేకపోతే ఆ భూములు కొన్నవారి పేర్లు బయటపెట్టాలని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.