CM KCR fires on Central govt: కేంద్ర ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీరాజ్ విభాగంలో రాష్ట్రానికి 10 అవార్డులు వచ్చాయన్న సీఎం... రాష్ట్రంలోని ఎన్నో పథకాలను నీతిఆయోగ్ ప్రశంసించిందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి ప్రశంసలే తప్ప... నిధులు రాలేదని ఆరోపించారు. శుష్కప్రియాలు... శూన్య హస్తాలు అన్నట్లు కేంద్ర విధానం ఉందని విమర్శించారు. కేంద్ర- రాష్ట్ర ఉమ్మడి పథకాల్లో తెలంగాణ రూ.1.92 లక్షల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. కేంద్రం నుంచి మాత్రం రాష్ట్రానికి రూ.5 వేల కోట్లు వచ్చాయని వెల్లడించారు. కేంద్రానికి మేము పంపించిన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. జీఎస్టీ బకాయిలు కూడా చెల్లించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
kcr fires on modi: దేశంలో ఏకస్వామ్య పార్టీ విధానం వస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు అన్నారని సీఎం గుర్తు చేశారు. ఈ నిరంకుశ విధానం దేశానికి మంచిదా? అని ప్రశ్నించారు. రాజ్యంగ సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. పన్నుల వసూలులో రాజ్యాంగంపరంగా కొన్ని పద్ధతులు ఉన్నాయన్న కేసీఆర్... రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్సులు వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన రూ.14 లక్షల కోట్ల నిధులు ఎగ్గొట్టారని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వ విధానాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బతీస్తున్నాయని వెల్లడించారు. ప్రగతిలో దూసుకెళ్తున్నరాష్ట్రాల కాళ్లల్లో కట్టెలు పెట్టవద్దని నీతి ఆయోగ్ సమావేశాల్లో చెప్పానని గుర్తు చేశారు. దేశం మొత్తానికి విద్యుత్, నీళ్లు ఎలా ఇవ్వొచ్చో నీతిఆయోగ్ సమావేశాల్లో చెప్పానని తెలిపారు. ఆ సమావేశాల్లో మాట్లాడేందుకు కూడా సమయం నిర్ణయిస్తారని చెప్పారు. వాళ్లు చెప్పేది మాత్రం వింటూ.. పెట్టే పల్లికాయలు తింటూ.. కూర్చొవాలి తప్ప ఏం ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు.
మీరు కబళించిన రాజ్యాంగ సంస్థలే రేపు మిమ్మల్ని కూడా కబళిస్తాయి. దేశమంతా ఏక్‌నాథ్ శిందేలు వస్తారని బెదిరిస్తున్నారు. ప్రభుత్వాలను కూల్చడమే సమాఖ్య విధానమా?. ప్రశ్నించిన రైతులను కార్లతో తొక్కించారు. పాలు, పెరుగు మీద పన్ను.. చివరికి శ్మశానంలో కూడా పన్ను వేస్తున్నారు. గుజరాత్‌లో చేసే గార్భా అనే సంప్రదాయ నృత్యం మీద కూడా పన్ను వేశారు. - కేసీఆర్, ముఖ్యమంత్రి
ఇదీ చూడండి: 'కేంద్రం వైఖరి సరిగా లేదు.. నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా..'