CM KCR on Rains: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ బృందాలు అప్రమత్తం ఉండాలని సీఎం సూచించారు. రెడ్ అలర్ట్ దృష్ట్యా పరిస్థితులు సమీక్షిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితులను బట్టి నేడో, రేపో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు. జిల్లాల్లో స్థానిక నేతలు ప్రజల రక్షణ కోసం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున వరదలు వస్తున్నాయన్న సీఎం... నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు.
రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ నష్టాలు జరగకుండా చూసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ సూచించారు. భారీ వర్షాలు, వరదల దృష్ట్యా అనవసరంగా ప్రజలు రిస్క్ తీసుకోవద్దని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా ఈనెల 15 నుంచి జరగాల్సిన రెవెన్యూ సదస్సులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
భారీ నుంచి అతిభారీ వర్షాలు
రాష్ట్రంలో అక్కడక్కడ ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశంముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల మూడు రోజులు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈ రోజు ఉదయం ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడన ప్రదేశం ఏర్పడిందని ప్రకటించారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6కిమీ వరకు విస్తించిందని.. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని వివరించారు. ఈ రోజు రుతుపవన ద్రోణి అనూపఘర్, శిఖర్, గ్వాలియర్, సాత్నా, పెండ్రా రోడ్ అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొన్నారు.