Telangana CMRF Fraud : ఎవరైనా అనారోగ్యం పాలై ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం అండగా నిలబడుతోంది. రోగి తీసుకున్న వైద్యం, చెల్లించిన నగదుకు సంబంధించిన బిల్లులన్నీ జతపర్చాల్సి ఉంటుంది. సంబంధిత ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి సంతకం, ఆస్పత్రి గుర్తింపు సంఖ్య, ఇతర వివరాలతో కూడిన పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది.
Telangana Chief Minster's Relief Fund Fraud : ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం అధికారులు రోగి సమర్పించిన బిల్లులు, వివరాలు, అందించిన చికిత్స గురించి సంబంధిత ఆస్పత్రి ద్వారా వివరాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆస్పత్రిలో అయిన మొత్తం బిల్లులో కొంత మొత్తాన్ని చెల్లిస్తూ వస్తున్నారు. అయితే ఈ పథకంలో వచ్చే డబ్బులను దక్కించుకోవడానికి కొంత మంది దళారులు అడ్డదారులు తొక్కారు. ఆస్పత్రులకు సంబంధించిన నకిలీ బిల్లులు సృష్టించి, సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నారు. రోగి చికిత్స చేయించుకోకున్నా, బిల్లులు సృష్టించారు. అధికారుల పరిశీలనలో ఈ వైనం బయటపడింది.
Chief Minster's Relief Fund Fraud in Telangana : సీఎం సహాయనిధి దరఖాస్తులు పరిశీలిస్తున్న సచివాలయ రెవెన్యూ విభాగ అధికారులకు కొన్ని అనుమానాస్పదంగా కనిపించడంతో క్షుణ్ణంగా పరిశీలించారు. నాలుగు నకిలీ రశీదులను గుర్తించి మార్చి 21న సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం సీసీఎస్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు మిర్యాలగూడ, ఖమ్మం పట్టణాల్లోని రెండు ఆసుపత్రుల నుంచి రూ.8 లక్షలకు నకిలీ బిల్లులు సేకరించినట్టు నిర్దారించారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో నకిలి : బిల్లులు ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసిన మిర్యాలగూడకు చెందిన ఓ వ్యక్తి ఇందులో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. మిర్యాలగూడ, ఖమ్మం జిల్లాల ఆసుపత్రుల పేరుతో నకిలీ బిల్లులు సృష్టించినట్టు తొలుత పోలీసులు భావించారు. తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యుల పేర్లతోనూ సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తులు వచ్చినట్టు గుర్తించారు.
తెలివితో వేరే నియోజకవర్గం ఎమ్మెల్యేల సంతకం : సచివాలయ రెవెన్యూ విభాగం తనిఖీల్లో మరికొన్ని నకిలీ రశీదులు గుర్తించినట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగా నాలుగు ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నగదు మంజూరు కావాలంటే ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల సిఫార్సు లేఖ తప్పనిసరి. ఈ ముఠా తమ బండారం బయటకు రాకుండా ఉండేందుకు వేర్వేరు నియోజకవర్గాల ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లేఖలు తీసుకున్నట్టు సమాచారం.
సీఐడీకి కేసు: వివిధ జిల్లాల నుంచి నకిలీ బిల్లులు వస్తుండటంతో సీఎం సహాయ నిధికి సంబంధించిన అధికారులు సంబంధిత వివరాలను సీఐడీ అధికారులకు అందించారు. ఇప్పటికే నకిలీ బిల్లులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తుండటంతో, ఆ కేసును సీఐడీకి బదిలీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సీసీఎస్ పోలీసులు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఈ కేసు సీఐడీ చేతుల్లోకి వెళ్లనుంది.
ఇవీ చదవండి: