అన్ని పట్టణాలు, నగరాల్లో మూణ్నెళ్లలో పబ్లిక్ టాయిలెట్లు, ఎనిమిది నెలల్లో విద్యుత్ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారం కాకపోతే సంబంధిత ఎమ్మెల్యేలు, మేయర్లు, ఛైర్ పర్సన్లు, కమిషనర్లు బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. వార్డుల వారీగా ప్రణాళికలు తయారు చేసి పట్టణ ప్రగతిని పటిష్ఠంగా అమలు చేయాలని ఆదేశించారు. నిధుల వినియోగంలో కచ్చితమైన క్రమశిక్షణ పాటించాలని స్పష్టం చేశారు.
ఆ ప్రాంతాలపై దృష్టి సారించాలి
పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు ఈ నెల 24 నుంచి నిర్వహించే పట్టణ ప్రగతిలో చేయాల్సిన కార్యక్రమాలను పురపాలక సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులకు వివరించారు. పల్లె ప్రగతి పునాదిగా పట్టణ ప్రగతి నిర్వహించాలన్న సీఎం... ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని చెప్పారు.
ప్రగతి మీ బాధ్యతే
రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలను దేశంలోనే ఆదర్శంగా మార్చే బాధ్యత మేయర్లు, ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంచి పట్టణాలు, నగరాలు ఎలా ఉండాలన్న విషయమై ఎవరికి వారు ప్రశ్నించుకొని ముందుకెళ్లాలని చెప్పారు. జనాభాను అనుసరించి పరిశుభ్రమైన శాఖాహార, మాంసాహార, పండ్లు, పూలమార్కెట్లు ఏర్పాటు చేయాలని కేసీఆర్ తెలిపారు. యువతకు అవసరమైన క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్‌లు ఉండాలన్నారు.
త్వరలోనే సంపూర్ణ అక్షరాస్యత
వీధి వ్యాపారుల కోసం అన్ని పట్టణాల్లో స్ట్రీట్ వెండింగ్ జోన్స్ చేర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఆటోలు, ట్యాక్సీలు, ఇతర వాహనాలకు నిర్దిష్ట ప్రదేశాల్లో పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని తెలిపారు. సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే చేపడుతుందని... కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బాధ్యత తీసుకొని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని చెప్పారు.
పల్లె ప్రగతి సమీక్షపై అసంతృప్తి
పల్లెప్రగతి కార్యక్రమ సమీక్షకు సంబంధించి మండల పంచాయతీ అధికారుల తీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు గ్రామాల్లో పర్యటించాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆక్షేపించారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు గ్రామాల్లో రాత్రి బసచేసి పాదయాత్ర నిర్వహించి పల్లె ప్రగతి లక్ష్యాలను సాధించాలని ముఖ్యమంత్రి కోరారు.
పారదర్శక విధానాలుండాలి
నాయకుడి మీద ప్రజలకు ఒక్కసారి విశ్వాసం కలిగితే, సంపూర్ణంగా సహకరిస్తారని ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు. మున్సిపాలిటీ అంటేనే మురికి, చెత్తకు పర్యాయపదంగా.. అవినీతికి మారుపేరైందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. బల్దియా.. ఖాయా, పీయా, చల్దియా అనే సామెతలు వచ్చాయని... ఆ చెడ్డ పేరు పోవాలంటే పారదర్శకమైన విధానాలు అవలంబించాలని సూచించారు.
చరిత్ర సృష్టిద్దాం
అడ్డదిడ్డంగా కాకుండా పట్టణ ప్రగతి ప్రణాళికా బద్ధంగా సాగాలని.. అది మేయర్లు, చైర్ పర్సన్ల చేతిలోనే ఉందని వ్యాఖ్యానించారు. సరిగ్గా అనుకుని ఆర్నెళ్లు కష్టపడితే పట్టణాలు మంచి దారి పడతాయని కేసీఆర్ అన్నారు. ఎప్పుడూ ఇతర దేశాల విజయగాథలు వినడమే కాకుండా.. మనమూ విజయం సాధించి పట్టణాలను మార్చుకోవాలని చెప్పారు.
- ఇదీ చూడండి : ఆ వీడియోను పూర్తిగా చూడండి: మంత్రి కేటీఆర్