హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. కౌంటింగ్ సమయంలో కరోనా నిబంధనలు విధిగా పాటించాలని పేర్కొన్నారు. ఏజెంట్లకు పీపీఈ కిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 30న బయటకు వచ్చిన వీవీప్యాట్ పోలింగ్‌కు వినియోగించినది కాదని స్పష్టం చేశారు.
ఓట్ల లెక్కింపు రెండు హాళ్లలో ప్రారంభమై... 22 రౌండ్ల వరకు కొనసాగుతుందని సీఈఓ తెలిపారు. లెక్కింపు కేంద్రం వద్ద జనం గుమిగూడరాదన్న ఆయన... విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. గెలిచిన వారితో ఇద్దరికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
అర్హులైన వారందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి..
రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని శశాంక్ గోయల్ కోరారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి రాజకీయ పార్టీలు పలు సలహాలు ఇచ్చాయని అన్నారు. ఖాళీగా ఉన్న బీఎల్ఓలను నియమించడంతో పాటు చనిపోయిన వారి ఓట్లు తొలగించాలని కోరినట్లు చెప్పారు. ఒక కుటుంబం ఓట్లన్నీ ఒకే చోట ఉండాలని తెలిపారు.
ఇదీ చదవండి: Shashank goyal News: రాజకీయ పార్టీలతో సీఈవో భేటీ.. ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన