రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఆర్టీసీపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విలీనం డిమాండ్‌తో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తోన్న నేపథ్యంలో కేంద్ర చట్టాన్ని అనుసరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
50 శాతం ఆర్టీసీ బస్సులు, 30 శాతం అద్దె బస్సులు పోను మిగతా 20 శాతం ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతి ఇవ్వాలన్నది సర్కార్ ఆలోచన. అందుకు అనుగుణంగా ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతిస్తూ కొన్ని మార్గాల ప్రైవేటీకరణకు సంబంధించి కేబినెట్లో విధానపర నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఆర్టీసీని మూడుగా విభజిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మొత్తానికి ఆర్టీసీకి సంబంధించి సమూల మార్పే ధ్యేయంగా మంత్రివర్గం కీలకనిర్ణయాలను తీసుకోనుంది.
ప్రస్తావనలో కీలక అంశాలు
మరికొన్ని కీలక అంశాలు కూడా మంత్రివర్గ సమావేశ ఎజెండాలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫించన్ దారులకు డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. 2019 జనవరి ఒకటో తేదీ నుంచి డీఏను 3.44 శాతం పెంచే అవకాశం ఉంది. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా పదిమంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిసస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో మానవహక్కుల కమిషన్ ఏర్పాటుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
పలు కోర్టుల్లో పోస్టులపై నిర్ణయం
భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనుంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లా యూనిట్లలో ప్రత్యేక ఫింగర్ ప్రింట్ యూనిట్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. పలు కోర్టుల్లో పోస్టులు మంజూరు చేయనున్నారు. మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖను రహదారులు, భవనాల శాఖలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
కొత్త పోస్టులు మంజూరు చేసే అవకాశం
రంగారెడ్డి జిల్లాలో నందిగామ పంచాయతీని విభజించి కొత్తగా అంకిరెడ్డిగూడ గ్రామపంచాయతీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. అత్తాపూర్, శంషాబాద్ అర్బన్‌లలో కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, సైబరాబాద్‌లోని 20 పోలీస్ స్టేషన్ల స్థాయి పెంపు సహా 1396 కొత్త పోస్టులను మంజూరు చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఎంపీడీఓ కార్యాలయాల్లో 1212 పోస్టుల మంజూరుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పోలీస్ శాఖలో ఐదు డీఎస్పీ, రెండు అదనపు కమాండెంట్ సూపర్ న్యూమరరీ పోస్టుల మంజూరుకు అనుమతి ఇవ్వనుంది. వీటితో పాటు పురపాలక ఎన్నికల నిర్వహణ, ధాన్యం సేకరణ, పట్టణాల్లో పారిశుద్ధ్య ప్రణాళిక సహా ఇతర అంశాలపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీపై హైకోర్టు అసహనం వ్యక్తం