రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్ కాలేజీల (Medical Colleges) ఏర్పాటుకు కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ (KTR) వెల్లడించారు. మహబూబాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు కేవలం నాలుగు మెడికల్ కాలేజీలే ఉన్నాయన్న కేటీఆర్.. కేసీఆర్ ప్రభుత్వంలో 2014- 18 మధ్య ఐదు కాలేజీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. త్వరలో మరో ఏడు వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. వైద్య కళాశాలలతో పాటు 13 నర్సింగ్ కళాశాలల ఏర్పాటునకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 100 చొప్పున సీట్లతో నర్సింగ్ కాలేజీలు మంజూరు చేశారు.
దీంతో పాటు జర్నలిస్టులు, వ్యాపారులకు టీకాలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేబినేట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి త్వరలో మార్గ దర్శకాలు విడుదల చేస్తామన్నారు.
భూములు, వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతి
భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు అనుమతించాలని కేబినెట్ నిర్ణయించింది. వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతించింది. లాక్‌డౌన్ సడలింపు నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఇదీ చూడండి: Lockdown Extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు