Telangana Budget 2022: 2022-23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను రేపు శాసనసభ, మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 2023 సాధారణ ఎన్నికలకు ముందు కేసీఆర్ నేతృత్వంలోని తెరాస సర్కార్ ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి చివరి బడ్జెట్ ఇదే. అందుకు అనుగుణంగానే వార్షిక పద్దును సిద్ధం చేసినట్లు తెలిసింది. సర్కార్ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు ఉండనున్నాయి. యధావిధిగా సంక్షేమం, వ్యవసాయ రంగాలకే బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నారు. అన్నింటి కంటే దళితబంధు పథకానికి నిధులు ఎక్కువగా కేటాయించనున్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వడ్డీ లేని రుణాలు, ఇళ్ల నిర్మాణం తదితరాలకు కేటాయింపులు పెరగనున్నాయి.
కేటాయింపులు...
సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థికసాయం పథకానికి బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు సమాచారం. సంక్షేమం తర్వాత వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఉండనున్నాయి. రైతుబంధు, రైతుబీమాతో పాటు రుణమాఫీకి నిధులు ఉండనున్నాయి. వివిధ దశల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల పనులకు అవసరమైన నిధులు కేటాయించనున్నారు. రహదార్లు, మౌలిక వసతుల నిర్మాణం, విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు పెరగనున్నాయి. మన ఊరు- మన బడి కార్యక్రమాలకు నిధులు ఇవ్వనున్నారు. పీఆర్సీసీకి అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు, కొత్త నియామకాలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు ఉండనున్నాయి.
బడ్జెట్ పరిమాణం పెరిగే అవకాశం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వీయ పన్నుల ద్వారా ఖజానాకు ఆదాయం బాగానే సమకూరింది. అధికారిక లెక్కల ప్రకారం జనవరి నెలాఖరు నాటికి పన్ను వసూలు అంచనాలను 80 శాతం చేరుకొంది. వచ్చే ఏడాదికి ఈ అంచనాలు 20 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. అన్ని రకాల పన్నుల ఆదాయం 15 నుంచి 20 శాతం వరకు పెరుగుతుందని భావిస్తున్నారు. వీటితో పాటు జీఎస్డీపీ వృద్ధి రేటు కూడా బాగా ఉంది. 19 శాతం వృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకొని పద్దు పరిమాణం పెరగనుంది. జీఎస్డీపీ వృద్ధితో 4 శాతం ఎఫ్ఆర్బీఎం పరిమితికి అనుగుణంగా బాండ్ల విక్రయం ద్వారా తీసుకునే రుణాల మొత్తం కూడా పెరగనుంది. వివాదాలు, చిక్కుముడులు వీడడంతో భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయ లక్ష్యాన్ని బాగానే నిర్దేశించుకున్నట్లు సమాచారం. వీటన్నింటి దృష్ట్యా... బడ్జెట్ పరిమాణం బాగానే పెరిగే అవకాశం కనిపిస్తోంది.
సీఎం సమీక్ష...
మరోవైపు బడ్జెట్, శాసనసభ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, అధికారులతో సమావేశమైన సీఎం... సంబంధిత అంశాలపై చర్చించారు.
ఇదీ చదవండి : 'ఫ్రంట్ గురించి చర్చించలేదు.. ప్రత్యామ్నాయ విధానంలో భాగంగానే.. '