రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని హరీశ్‌రావు తెలిపారు. వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, వివిధ పంటల కొనుగోలు కోసం భారీగా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎంత ఖర్చయినా సరే మొత్తం కందులు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం రూ.1,000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
విత్తనాల రాయితీ కోసం రూ.142 కోట్లు అందించామన్న హరీశ్.. గోదాముల నిల్వ సామర్థ్యం 22.47 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామని పేర్కొన్నారు. పండ్లు, కూరగాయల సాగులో స్వయం సమృద్ధే సీఎం కేసీఆర్ సంకల్పమని తెలిపారు.
బిందు, తుంపర సేద్యం..
తుంపర సేద్యం కోసం ఎస్సీ, ఎస్టీలకు వందశాతం, బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. తుంపర సేద్యం పథకం కింద 2,49,200 మంది రైతులకు రూ.1,819 కోట్ల లబ్ధి చేకూర్చామన్నారు. సూక్ష్మ సేద్యం కోసం రూ.600 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
రైతు వేదికల ఏర్పాటు..
రైతు వేదికల నిర్మాణం కోసం రూ.350 కోట్లు కేటాయిస్తున్నామని హరీశ్ చెప్పారు. రైతులు చర్చించుకునేందుకు వీలుగా రైతు వేదికల ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి 5 వేల ఎకరాల క్లస్టర్‌కు ఒక రైతు వేదిక నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
పాడి పరిశ్రమ-అభివృద్ధి
రైతుల నుంచి సేకరించే పాలపై లీటరుకు ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహం అందిస్తోంది ఆర్థిక మంత్రి తెలిపారు. పాలసేకరణ ప్రోత్సాహం ద్వారా 99,282 మంది పాడి రైతులకు లబ్ధి చేకూరుస్తున్నామని ఉద్ఘాటించారు. పాడి రైతుల ప్రోత్సాహకం కోసం రూ.100 కోట్లు కేటాయింపు చేసినట్లు చెప్పారు.
ఇవీ చూడండి: 'దేశానికంటే రాష్ట్ర తలసరి ఆదాయమే ఎక్కువ'