ముఖ్యమంత్రి కేసీఆర్ కొండ పోచమ్మ చెరువు ప్రారంభించడం వల్ల నీళ్లు రాలేదు కానీ... కరోనా వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ప్రారంభోత్సవ వేడుకలో భౌతిక దూరం పాటించకపోవడం వల్లే ఎమ్మెల్యేలు, అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆరోపించారు. 50 వేల పరీక్షలు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఎన్ని రోజుల్లో చేస్తాడో స్పష్టం చేయాలన్నారు. 50 వేల పరీక్షలు చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
దిల్లీ ప్రభుత్వం చేతులెత్తేయడం వల్లనే కేంద్రం చొరవ తీసుకుందన్న ఆయన తెలంగాణపై కేంద్రం చొరవ తీసుకుంటే కేసీఆర్ బండారం బయట పడుతుందనే పరీక్షలు చేస్తామని ప్రకటించారని దుయ్యబట్టారు. గవర్నర్ గాంధీకి వెళ్లి పరిశీలించారు తప్పితే... ముఖ్యమంత్రి ప్రగతి భవన్, ఫామ్ హౌస్ విడిచి రావడం లేదని మండిపడ్డారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 245 కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేలా ఉందని విమర్శించారు.
ఇవీ చూడండి: దేశంలో ఒక్కరోజులో 2003 కరోనా మరణాలు