Piyush Goyal Appointment to BJP Leaders Delhi : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భాజపా రాష్ట్ర ముఖ్యనేతలు భేటీ అయ్యారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం... గోయల్‌ను కలిసింది. ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కలిసి... రాష్ట్రంలోని పరిస్థితిని వివరించనున్నారు.
మంత్రులకూ అపాయింట్మెంట్
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు రాష్ట్ర మంత్రులకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ లభించింది. గోయల్‌తో మంత్రుల బృందం సమావేశం కానుంది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర మంత్రులకు సమయమిచ్చినట్లుగా తెలుస్తోంది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వక హామీని మంత్రులు కోరనున్నట్లుగా సమాచారం. గోయల్‌ను కలిసేందుకు మంత్రులు రెండు రోజులుగా నిరీక్షించారు.
దిల్లీలో మంత్రుల బృందం
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర మంత్రులు, ఎంపీలు దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి, జగదీశ్ రెడ్డి, పువ్వాడ, వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు పలువురు పార్లమెంట్ సభ్యుల బృందం హస్తినకు వెళ్లింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో దిల్లీ వెళ్లిన మంత్రుల బృందం... కేంద్రమంత్రి, ప్రధానమంత్రితో భేటీకి యత్నాలు చేశారు.
ఈ భేటీకి ప్రాధాన్యం ఎందుకంటే?
రాష్ట్ర మంత్రులు అపాయింట్‌మెంట్‌కు ముందే భాజపా నేతలు పీయూష్ గోయల్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. భాజపా రాష్ట్ర ముఖ్యనేతలు పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ ఇతర ముఖ్యనేతలు గోయల్‌తో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం భాజపా రాష్ట్ర ముఖ్యనేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ధాన్యం కొనుగోళ్లపై తెరాస ఆందోళనల దృష్ట్యా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తెరాసను ఎదుర్కొనే వ్యూహాలపై అమిత్ షా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది..
ఇదీ చదవండి: అయ్యయ్యో.. టీకా వద్దమ్మా.. ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకున్న కుటుంబం!