కరోనా సమస్యలపై సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్లో కలిసేందుకు వెళ్తున్న లక్ష్మణ్‌ను ఇంటి నుంచి బయటికి రానీయకుండా గృహనిర్బంధంలో ఉంచారు. భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావును తార్నాకలోని తన నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేసి... ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే రాజా సింగ్ నివాసం వద్ద పోలీసులు మోహరించి... గృహ నిర్బంధంలో ఉంచారు.
ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దేశంలో అతి తక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. గాంధీ ఆస్పత్రిలో వైద్యులు మూడు రోజులపాటు ధర్నా చేసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఐసీఎంఆర్ సూచనలు, హైకోర్టు ఆదేశాలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరోనా విషయంలో రాష్ట్రంలో పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతోంది. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాల తారుమారు, జర్నలిస్ట్ మనోజ్ మృతిపై విచారణ జరిపించాలి.
- లక్ష్మణ్, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలి. గాంధీ ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలి. అన్ని జిల్లాల్లో కొవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలి. కరోనా వైరస్ సోకిన రోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి. జర్నలిస్టులను కరోనా వారియర్స్‌గా గుర్తించాలి.
- రాంచందర్‌రావు, ఎమ్మెల్సీ
ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్తామన్న భాజపా నేతలను పోలీసులు గృహనిర్బంధించడాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. కరోనా విషయంలో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతోందని ఆయన గుర్తు చేశారు.
ఇది ప్రజలను కాపాడడానికి తప్ప ఇంకొకటి కాదు. ముఖ్యమంత్రి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం సమస్యలను ఎత్తితే దాడి చేయడం పరిపాటిగా మారింది. ఇది ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి మంచిది కాదు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తులు విపక్ష పార్టీల నేతలు కలుస్తాం అంటే అరెస్టు చేయడం, గృహనిర్బంధం చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. ప్రజాస్వామ్య వాదులందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ఖండించాలి.
- బండి సంజయ్ కుమార్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: 'ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది'