రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి భాజాపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రజలంతా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో భాజపా కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. దేశం ఫస్ట్.. పార్టీ నెక్ట్స్.. ఫ్యామిలీ లాస్ట్.. అనేదే భాజపా నినాదమని చెప్పారు.
‘‘రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేక వాతావరణం నెలకొంది. ఆయన పాలనపై ప్రజలు కోపంతో ఊగిపోతున్నారు. ఇదే విషయాన్ని భాజపా కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలి. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారు. రైతులను గోస పెడుతున్నారు. 2023లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుంది. తెరాస కథ ముగుస్తుంది. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సుపరిపాలనపై ఈ నెల 30నుంచి జూన్ 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి. తెరాస నుంచి భాజపాలోకి వచ్చేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పెద్ద ఎత్తున నాయకులు ఆసక్తి చూపుతున్నారు. కమిటీలు నియమించుకుని ఆయా నేతలను భాజపాలోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలి’’ అని తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం లేఖ
భారీ వర్షంతో పవర్ కట్.. రోప్వేకు బ్రేక్.. గంటన్నరపాటు గాల్లోనే జనం!