08:15 PM
సభ వాయిదా
శాసనసభ సమవేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. తిరిగి మరలా రేపు ఉదయం 11 గంటలకు పునః ప్రారంభం కానున్నాయి.
07:53 PM
సీఎం పదే పదే మాపై వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదు :హరీశ్‌రావు
సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే మాపై వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం రెండో టీఎంసీ ఖర్చు కూడా కలిపి సీఎం చెప్పారు
07:47 PM
విద్యుత్ శాఖలో రూ.4,370 కోట్ల విలువైన ఆస్తులను కుదువపెట్టారు: సీఎం
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్లు, ఆస్తులను కుదువపెట్టి అప్పులు తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ శాఖలో రూ.4,370 కోట్ల విలువైన ఆస్తులను కుదువపెట్టారని ఆరోపించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం బకాయిలు కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కూడా చెల్లింపులు చేయలేదని అన్నారు.
07:42 PM
వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది: సీఎం
వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందనేది వాస్తవమని చెప్పారు. గత ప్రభుత్వ మంత్రులు కాళేశ్వరం విషయంలో తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరాలని తెలిపారు.
07:40 PM
గత ప్రభుత్వం విద్యార్థులకు మెస్ ఛార్జీలు కూడా చెల్లించలేదు: మంత్రి పొన్నం
రాష్ట్రాలు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవటం నేరం కాదని హరీశ్‌రావు అన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు మెస్ ఛార్జీలు కూడా చెల్లించలేదు మంత్రి పొన్నం తెలిపారు. అద్దె భవనాల్లో నడుస్తున్న సంక్షేమ హాస్టళ్లకు అద్దెలు కూడా చెల్లించలేదని అద్దెలు చెల్లించకపోవడంతో యజమానులు హాస్టళ్లను ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
07:36 PM
రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందనేది అవాస్తవం: హరీశ్‌రావు
రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందనేది అవాస్తవమని హరీశ్‌రావు అన్నారు. రూ.5 లక్షల కోట్ల అప్పును రూ.7 లక్షల కోట్లుగా చూపించారని మండిపడ్డారు. రాష్ట్రంలో పెరిగిన ఆస్తుల గురించి ఈ ప్రభుత్వం వెల్లడించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 22 రాష్ట్రాలు అప్పుల్లో తెలంగాణ కంటే ముందున్నాయని తెలిపారు. సొంత ఆదాయ వనరుల వృద్ధిలో తెలంగాణ ఎంతో ముందుందని స్పష్టం చేశారు.
06:51 PM
కాళేశ్వరం కోసం కార్పొరేషన్ల పేరుతో భారీగా రుణాలు తెచ్చారు : భట్టి విక్రమార్క
కాళేశ్వరం కోసం కార్పొరేషన్ల పేరుతో భారీగా రుణాలు తెచ్చారని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కార్పొరేషన్లు రుణాలు చెల్లించలేకపోతే ప్రభుత్వమే కదా చెల్లించాల్సిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకున్నదని తెలిపారు. ఆర్‌బీఐ నుంచి ఓడీ తీసుకువచ్చి ప్రభుత్వం నడిపించారని అన్నారు. చేసిన అప్పులకు ఏమైనా స్థిరాస్తులు కనిపిస్తున్నాయా అంటే అదీ లేదని పేర్కొన్నారు. కొన్ని పనులకు సంబంధించి రూ.1.59 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ప్రతిపక్షం ఉండాలని కోరుకునే పార్టీ మాదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని ఒప్పుకున్న విపక్షానికి ధన్యవాదాలు తెలిపారు.
2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు రుణభారం కేవలం 14 శాతం ఉండేదని ఇప్పుడు తెలంగాణ రుణభారం 34 శాతం దాటి పోయిందని భట్టి అన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఆస్తుల సృష్టి జరగలేదని, అప్పులు మాత్రం భారీగా పెరిగాయని స్పష్టం చేశారు.
06:50 PM
అంకెల గారడీతో 9 ఏళ్లు ప్రజలను మోసం చేశారు: భట్టి విక్రమార్క
వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే శ్వేతపత్రం విడుదల చేశామని భట్టి అన్నారు. 'తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం మంచి ఆలోచనలతో ముందుకు రావాలని ఆశిస్తున్నాం. రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లడంపై చర్చిద్దాం. ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కు, చేసిన ఖర్చుకు మధ్య అంతరం భారీగా ఉండేది అంకెల గారడీతో 9 ఏళ్లు ప్రజలను మోసం చేశారు. ఆర్థిక ప్రణాళిక లేకుండా ఖర్చు చేసి రాష్ట్రానికి నష్టం చేశారు 1956 నుంచి 2014 వరకు తక్కువ ఖర్చుతోనే భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. నాగార్జునసాగర్, శ్రీరామ్‌సాగర్, ఎల్లంపల్లి, దేవాదుల వంటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది.
నగరంలో బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్ చుట్టూ ఓఆర్‌ఆర్, విమానాశ్రయం ఏర్పాటు జరిగింది నిజాంసాగర్, అలీసాగర్, కడెం, లోయర్ మానేరు, అప్పర్ మానేరు నిర్మాణం జరిగింది. ఖర్చుకు తగినట్లు కంటికి కనిపించే భారీ ప్రాజెక్టు ఒక్కటైనా నిర్మించారా? ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ నిధులతోనే వందలాది సంస్థల ఏర్పాటు జరిగింది. 2014 నుంచి 2023 వరకు ఏటా లక్షల కోట్లతో నాగార్జుసాగర్ దగ్గరికి వెళ్తే కుడి, ఎడమ భారీ కాలువలు, లక్షల ఎకరాల ఆయకట్టు కనిపిస్తుంది సీతారామ, పాలమూరు ప్రాజెక్టుల వద్దకు వెళ్తే ఏమైనా కనిపిస్తుందా? అద్భుతంగా కాళేశ్వరం కట్టామని చెప్పారు. చూద్దామని వెళ్తే అది కుంగిపోయి ఉంది మేడిగడ్డ మొత్తం ఇసుకలో కుంగిపోయింది. ఏమీ చేయలేమని జాతీయ డ్యామ్ సేఫ్టీ బృందం చెప్పింది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కూడా సురక్షితం కావని జాతీయ డ్యామ్ సేఫ్టీ బృందం చెప్పింది.'- భట్టి విక్రమార్క
05:28 PM
అధికారం కోల్పోవడం కొందరికి బాధ కలిగించొచ్చు : సీఎం రేవంత్ రెడ్డి
అధికారం కోల్పోవడం కొందరికి బాధ కలిగించొచ్చు అని రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం కోసం తండ్రిని పక్కకు పెట్టిన ఔరంగజేబు వంటి వారు ఉన్నారని తెలిపారు. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చామని చెప్పారు. సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.
05:26 PM
విద్యుత్, సాగునీటి రంగాలపైనా శ్వేతపత్రాలు విడుదల చేస్తాం: సీఎం
వాస్తవాలు దాచి గొప్పలు చెప్పుకోబట్టే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జీతాల ఆలస్యం వల్ల ఉద్యోగుల సిబిల్ స్కోరు దెబ్బతింటోందని చెప్పారు. బ్యాంకులు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అప్పులు ఇవ్వట్లేదని తెలిపారు. వాస్తవాలు కఠోరంగా ఉన్నప్పుడు వాటిని అంగీకరించాలని పేర్కొన్నారు. ఈ వాస్తవాలు కొందరికి చేదుగా ఉండొచ్చని ఇంకొందరికి కళ్లు తెరిపించవచ్చుని అన్నారు.
విద్యుత్, సాగునీటి రంగాలపైనా శ్వేతపత్రాలు విడుదల చేస్తాం సీఎం తెలిపారు. ప్రజలకు వాస్తవాలు వివరించడమే మా లక్ష్యమని అన్నారు. విపక్షాల నుంచి బలమైన సహకారం పొందడమే మా విధానమని తెలిపారు.
05:18 PM
రాష్ట్ర నిధుల విషయంలో ఆర్బీఐ రోజూ ఓ నివేదిక ఇస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర నిధుల విషయంలో ఆర్బీఐ రోజూ ఓ నివేదిక ఇస్తుంది : సీఎం రేవంత్ రెడ్డిశ్వేత పత్రంలో అవసరమైన చోట ఆర్‌బీఐ, కాగ్ నివేదికలను ప్రస్తావించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర నిధుల విషయంలో ఆర్బీఐ రోజూ ఓ నివేదిక ఇస్తుందని తెలిపారు. 2014-15లో 300 రోజులు మనకు మిగులు నిధులు ఉన్నాయని గత ఐదేళ్లలో కనీసం 150 రోజులు కూడా మిగులు నిధులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
05:16 PM
వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
శ్వేతపత్రంపై అక్బరుద్దీన్ అనుమానం వ్యక్తం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశామని తెలిపారు. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే మా లక్ష్యమని స్పష్టం చేశారు. ఆర్‌బీఐ, కాగ్ నుంచి సమాచారం తీసుకున్నామని చెప్పారు.
04:53 PM
తలసరి ఆదాయంలో తెలంగాణ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉంది : అక్బరుద్దీన్
తలసరి ఆదాయంలో కేంద్రం కంటే తెలంగాణ మెరుగ్గా ఉందని అక్బరుద్దీన్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉందని తెలిపారు. జీడీపీ కంటే తెలంగాణ జీఎస్‌డీపీ కూడా ఎక్కువే ఉందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ఆర్‌బీఐ కూడా చెప్పిందని గుర్తు చేశారు.
04:48 PM
శ్వేతపత్రంలో ఒక్కో పేజీలో ఒక్కో విధంగా సమాచారం ఉంది: అక్బరుద్దీన్
శ్వేతపత్రంలో ఒక్కో పేజీలో ఒక్కో విధంగా సమాచారం ఉందని అక్బరుద్దీన్ అన్నారు. ఒక శ్వేతపత్రంలో ఇలా ఎలా సమాచారం ఇస్తారని నిలదీశారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, బకాయిలు కూడా శ్వేతపత్రంలో ఉంటాయని భావించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వాలని కోరారు. ఎలాంటి షరతులు లేకుండా ఆరు గ్యారంటీలు అమలు చేయాలని సూచించారు.
04:36 PM
రాష్ట్రాన్ని అవమానించేందుకు శ్వేతపత్రం పెట్టలేదు: శ్రీధర్‌బాబు
రాష్ట్రాన్ని అవమానించేందుకు శ్వేతపత్రం పెట్టలేదు మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. పదేళ్ల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు మాత్రమే చెప్పదలచుకున్నామన్నారు. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం కూడా ముందుకెళ్లదని చెప్పారు. చేసిన అప్పులు సరైన విధానంలో ఖర్చు చేశారా లేదా అన్ని చెప్పేందుకే మేమున్నామని పేర్కొన్నారు. మా పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుపుతామని హామీ ఇచ్చారు. కాగ్ రిపోర్టు ప్రకారమే శ్వేతపత్రం రూపొందించాం స్పష్టం చేశారు.
04:31 PM
శ్వేతపత్రం విడుదల వెనుక ఉద్దేశం ఏంటో ప్రభుత్వం చెప్పాలి: అక్బరుద్దీన్
శ్వేతపత్రం విడుదల వెనుక ఉద్దేశం ఏంటో ప్రభుత్వం చెప్పాలని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. 'రాజకీయాల్లో విమర్శలు సహజమే. రాజకీయ లబ్ది కోసం విమర్శలు చేయడం సరికాదు. అక్బరుద్దీన్ రాజకీయాల కంటే రాష్ట్ర సమగ్రతను కాపాడటం మన మొదటి కర్తవ్యం. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని చెబుతున్నారు. తెలంగాణ వస్తే అంధకారమేనని గతంలో కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక విద్యుత్, తాగునీరు అన్నీ వచ్చాయి. అప్పులు పెరిగినా అభివృద్ధి కూడా గణనీయంగా జరిగింది. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనూ అప్పులు పెరిగాయి. కేంద్రం రూ.44,25,347 కోట్ల అప్పు చేసింది దాన్ని ఎందుకు ప్రశ్నించరు?. కేంద్రం గత పదేళ్లలో 244 శాతం అప్పులు పెంచింది. శ్వేతపత్రం అంతా తప్పుల తడకగా ఉంది.'- అక్బరుద్దీన్
04:28 PM
శ్వేతపత్రంలో రాష్ట్ర బడ్జెట్ సమాచారం మాత్రం వాడలేదు: అక్బరుద్దీన్
శ్వేతపత్రంలో ఆర్బీఐ, కాగ్ రిపోర్టులను ప్రస్తావించారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారు. తమకు అనుకూలమైన అంశాలనే తీసుకున్నారని తెలిపారు. 'శ్వేతపత్రంలో రాష్ట్ర బడ్జెట్ సమాచారం మాత్రం వాడలేదు. రాష్ట్రాన్ని రక్షించుకునేందుకే నేను మాట్లాడుతున్నా. అసెంబ్లీ నుంచి తప్పుడు సమాచారం బయటకు పంపకూడదు. రాష్ట్రానికి ఏదో జరిగిందన్న సందేశం సభ నుంచి వెళ్లకూడదు. తప్పు జరిగిందని భావిస్తే ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చు. సభను తప్పుదోవ పట్టించిన బ్యూరోక్రాట్లపై చర్యలు తీసుకోవాలి.'- : అక్బరుద్దీన్
03:58 PM
మేడిగడ్డ ప్రాజెక్టుపై మాజీ సీఎం ఇప్పటివరకు నోరెత్తలేదు: మంత్రి ఉత్తమ్
మేడిగడ్డ ప్రాజెక్టుపై మాజీ సీఎం ఇప్పటివరకు నోరెత్తలేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. అప్పటినుంచి కేసీఆర్ చెప్పినట్లే నిర్మించామని ఇంజినీర్లు చెప్పారని తెలియజేశారు. అక్టోబర్ 21న పిల్లర్లు కుంగితే సీరియస్ దర్యాప్తు, పరిశీలన కూడా జరగలేదని ప్రశ్నించారు.
03:56 PM
మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం తీవ్రమైన లోపభూయిష్టం: ఉత్తమ్
సీఐజీ రిపోర్టు ప్రకారం కాళేశ్వరం కింద 40 వేల ఎకరాలకే నీరు అందుతోందని ఉత్తమ్ అన్నారు. రూ.లక్ష కోట్ల నిధులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు శూన్యమని తెలిపారు. రూ.25 కోట్లు వెచ్చించిన పాలమూరు ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు శూన్యం మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం తీవ్రమైన లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు.
03:51 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిలో బియ్యానికి రూ.39 మాత్రమే ఖర్చు పెడుతున్నాయి : మంత్రి ఉత్తమ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిలో బియ్యానికి రూ.39 మాత్రమే ఖర్చు పెడుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్రం 5 కిలోల బియ్యం ఇస్తే రాష్ట్రం అదనంగా కిలో మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. ధాన్యం డబ్బులను కేంద్రప్రభుత్వం సకాలంలో చెల్లించట్లేదని అన్నారు. కేంద్రానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని కూడా రాష్ట్రం సక్రమంగా ఇవ్వట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల పౌరసరఫరాలశాఖ భారీ అప్పుల్లో ఉందని అన్నారు.
03:50 PM
పౌరసరఫరాల శాఖ రూ.56 వేల కోట్ల అప్పుల్లో ఉంది: మంత్రి ఉత్తమ్
కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యంతో పాటు కొన్ని నిత్యావసర సరుకులు ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు బియ్యం మాత్రమే ఇచ్చాయని తెలిపారు. పౌరసరఫరాల శాఖ రూ.56 వేల కోట్ల అప్పుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖకు బియ్యంపై రాయితీ నిధులను చెల్లించలేదని అన్నారు.
03:42 PM
మోదీ ఎన్నోసార్లు తెలంగాణ ఏర్పాటును అవమానించారు: మంత్రి పొన్నం
మోదీ ఎన్నోసార్లు తెలంగాణ ఏర్పాటును అవమానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ రావు అన్నారు.
03:38 PM
ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది: మంత్రి శ్రీధర్‌బాబు
ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. వంద రోజుల్లో మా హామీలు అమలు చేస్తామని చెప్పామని గుర్తు చేశారు.పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ అన్నారని తెలిపారు. పదేళ్లు అవుతున్నా రూ.15 లక్షలు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
02:38 PM
రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు అభ్యంతరం
రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు అభ్యంతరం తెలిపారు. రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కునే ఖర్మ తమకు పట్టలేదని హరీశ్ రావు అన్నారు. హరీశ్‌రావు వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీధర్‌బాబు, హరీశ్‌రావు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. రాజగోపాల్‌రెడ్డి ఉపసంహరించుకుంటే తానూ వెనక్కి తీసుకుంటానని హరీశ్‌రావు తెలిపారు. హరీశ్‌రావు మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ సూచించారు. సభానాయకుడిపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అందుకు బదులిచ్చిన హరీశ్‌రావు స్పీకర్ , సీఎంపై తాను వ్యాఖ్యలు చేయలేదని, రాజగోపాల్ గతంలో చెప్పినవే చెప్పానని వివరించారు.
02.34 PM
వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు-కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం
వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. హరీశ్‌రావు ప్రసంగాన్ని మంత్రులు తప్పుబడుతున్నారు. వెల్‌లోకి వచ్చిన నిరసన తెలిపిన బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి రావడంపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. శాసనసభ స్పీకర్‌ను మంత్రులు డిక్టేట్ చేస్తున్నారన్న బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు.
02.25 PM
ఎంత బాగా పనిచేసినా హరీశ్‌ను కేసీఆర్ సీఎం చేయరు: రాజగోపాల్‌రెడ్డి
తనకి మంత్రి పదవి ఇవ్వరని హరీశ్ అన్నారని, ఎంత బాగా పనిచేసినా హరీశ్‌ను కేసీఆర్ సీఎం చేయరని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
02.14 PM
నేను కాదు సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: హరీశ్‌రావు
నేను కాదు సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ద్వారా తీసుకున్న రుణాలు మిగిలిన ప్రాజెక్టులకూ వాడామని స్పష్టం చేశారు. మాకంటే బాగా పాలించి మంచి పేరు తెచ్చుకోమని సలహా ఇచ్చారు. మీ గ్యారంటీలు బాగా అమలు చేసి పేరు తెచ్చుకోండని అన్నారు. ఈ శ్వేత పత్రాలు రాష్ట్ర ప్రగతికి కోత పత్రాలు అవుతాయని పేర్కొన్నారు.
02.12 PM
సభను తప్పుదోవ పట్టించే వారిపై చర్యలు తీసుకోవాలి : సీఎం రేవంత్‌రెడ్డి
అవాస్తవాలతో హరీశ్‌రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సభను తప్పుదోవ పట్టించే వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరుతున్నారని చెప్పారు.
02.06 PM
కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి అప్పులు తెచ్చారు: సీఎం
కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి అప్పులు తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం నీటితో ఏటా రూ.5వేల కోట్లు సంపాదిస్తామని చెప్పారని గుర్తు చేశారు. మిషన్ భగీరథతో రూ.5,700 కోట్లు సంపాదిస్తామని చెప్పారని పేర్కొన్నారు. బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చి లోన్లు తెచ్చారని అన్నారు. కాళేశ్వరం, భగీరథతో రూ.10 వేల కోట్లు ఏటా జనం నుంచి వసూలు చేస్తామని నివేదికలిచ్చారని అన్నారు. తప్పుడు పద్ధతుల్లో రుణాలు తెస్తున్నారని కాగ్ తప్పుబట్టిందని తెలిపారు.
02.02 PM
కాళేశ్వరాన్ని రూ.80వేల కోట్లతో కట్టామనడం అబద్దం: సీఎం రేవంత్‌రెడ్డి
కాళేశ్వరాన్ని రూ.80వేల కోట్లతో కట్టామనడం అబద్దమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణమే రూ.97,448 కోట్లు మంజూరైందని తెలిపారు. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని పేర్కొన్నారు.
01.57 PM
మేడిగడ్డపై సింగిల్ జడ్జ్‌తో విచారణ జరిపించండి : హరీశ్‌రావు
మేడిగడ్డపై సింగిల్ జడ్జ్‌తో విచారణ జరిపించండని హరీశ్‌రావు అన్నారు. అప్పుడే తమ నిజాయతీ బయట పడుతుందని తెలిపారు.
01.49 PM
483 శాతం ధాన్యం కోనుగోళ్లలో వృద్ధి సాధించాం: హరీశ్‌రావు
483 శాతం ధాన్యం కోనుగోళ్లలో వృద్ధి సాధించామని హరీశ్‌రావు అన్నారు. 2014లో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉండేదని, ప్రస్తుతం 4 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి పెరిగిందని తెలిపారు. రూ.1, 649 కోట్లతో 25 జిల్లాల్లో కలెక్టరేట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.
01.39 PM
తెచ్చిన ప్రతి పైసా భవిష్యత్ అవసరాల కోసం ఖర్చు పెట్టాం: హరీశ్‌రావు
మంచినీళ్ల విషయంలో ప్రజల నుంచి ఎక్కడా ఒక్క రూపాయి వసూలు చేయలేదని హరీశ్‌రావు అన్నారు. తెచ్చిన అప్పులు ఎలా వినియోగించాం అనేది ముఖ్యమని చెప్పారు. అప్పులు తెచ్చి రాష్ట్రంలో ఆస్తులు సృష్టించామని పేర్కొన్నారు. తెచ్చిన ప్రతి పైసా భవిష్యత్ అవసరాల కోసం ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం రుణాలు తెచ్చామన్నారు.
01.30 PM
మోటార్లకు మీటర్లు అంశంపై ఉత్తమ్, హరీశ్‌రావు మధ్య వాగ్వాదం
అసెంబ్లీలో మోటార్లకు మీటర్లు అంశంపై ఉత్తమ్, హరీశ్‌రావు మధ్య వాగ్వాదం జరిగింది. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందన్న హరీశ్‌రావు వ్యాఖ్యలపై ఉత్తమ్ కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందా లేదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. విద్యుత్ బిల్లులు కట్టమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని ఉత్తమ్ బదులిచ్చారు.
01.27 PM
రాజకీయం కోసం అప్పుల రాష్ట్రంగా ప్రచారం చేయవద్దు : హరీశ్‌రావు
రూ.72 వేల కోట్లు రైతుబంధు కింద పెట్టుబడి సాయంగా అందించామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కీర్తి, పరపతి పెంచామని తెలిపారు. రాజకీయం కోసం అప్పుల రాష్ట్రంగా ప్రచారం చేయవద్దని చెప్పారు. తెలంగాణకు ఉన్న రుణాలు దీర్ఘకాలిక రుణాలని స్పష్టం చేశారు. ఈ రుణాలు అన్నీ పదేళ్ల తర్వాత చెల్లించాల్సినవేనని తెలిపారు.
01. 22 PM
ఈ శ్వేతపత్రం ఒక తప్పుల తడక, అంకెల గారడీ: హరీశ్‌రావు
ఈ శ్వేతపత్రం.. ఒక తప్పుల తడక, అంకెల గారడీనగా హరీశ్‌రావు అన్నారు. గ్యారంటీల నుంచి తప్పించుకునేందుకు సాకులు వెదుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉందని, అనేక ప్రభుత్వ సంస్థలు చెప్పాయని తెలిపారు.
01. 21 PM
ఆరోగ్య రంగంలో వ్యయాన్ని ఆరు రెట్లు పెంచాం : హరీశ్‌రావు
ఆరోగ్య రంగంలో వ్యయాన్ని ఆరు రెట్లు పెంచామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన డబ్బు రూ.లక్ష కోట్ల వరకూ ఆగిపోయిందని తెలిపారు. ఎస్పీవీల ద్వారా తీసుకున్న రుణాలను కూడా రాష్ట్ర అప్పులుగా చూపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం హామీ లేని రుణాలను కూడా ప్రభుత్వ అప్పుగా చూపించారని మండిపడ్డారు. ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేని వాటిని కూడా చెల్లించాలని తప్పుగా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
01.14 PM
15.6 శాతం వృద్ధిరేటుతో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపాం
15.6 శాతం వృద్ధిరేటుతో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
01.09 PM
సత్యదూరమైన మాటలు చెప్పి సభను పక్కదారి పట్టించవద్దు: శ్రీధర్‌బాబు
హరీశ్‌రావు వ్యాఖ్యలపై దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం పూర్తి తెలుసుకున్న తర్వాత సభలో మాట్లాడాలని సూచించారు. సత్యదూరమైన మాటలు చెప్పి సభను పక్కదారి పట్టించవద్దని హెచ్చరించారు. లెక్కల్లో తప్పొప్పులు ఉంటే మా ఆర్థిక మంత్రి చెబుతారని పేర్కొన్నారు. నివేదిక ఎవరో తయారు చేశారనే మాటలు సరికాదని హితవు పలికారు. హరీశ్‌రావు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
01.06 PM
నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు : హరీశ్‌రావు
నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని కోరారు. ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్ పాలన కొనసాగించాలని సూచించారు. ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనపడుతుందని విమర్శించారు. శ్వేత పత్రంలో ప్రజలు ప్రగతి కోణం లేదుని ఆరోపించారు.
శ్వేతపత్రంలో రాజకీయ ప్రత్యర్థులపై దాడి వాస్తవాల వక్రీకరణే ఉందని హరీశ్‌రావు అన్నారు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయండని సూచించారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సస్పెండ్ అయిన ఆంధ్రా అధికారితో నివేదిక తయారు చేయించారని ఆరోపించారు. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా అధికారులతో నివేదిక తయారు చేయించారని మండిపడ్డారు.
సీఎం పాత గురువు పాత శిష్యులు ఈ నివేదిక తయారు చేయించారని కావాలంటే వారి పేర్లుతో పాటు ఆధారాలు కూడా బయటపెడతని హరీశ్‌రావు తెలిపారు. అప్పులు, జీఎస్‌డీపీ నిష్పత్తిని ప్రగతికి కొలమానంగా తీసుకుంటారని అన్నారు. అప్పులు, జీఎస్‌డీపీ నిష్పత్తిని నివేదికలో చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
12.52 PM
శ్వేత పత్రంలో ప్రజలు.. ప్రగతి కోణం లేదు: హరీశ్‌రావు
నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని సూచించారు. ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్ పాలన కొనసాగించాలని చెప్పారు. ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనపడుతుందని తెలిపారు. శ్వేత పత్రంలో ప్రజలు ప్రగతి కోణం లేదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడి..వాస్తవాల వక్రీకరణ మాత్రమే ఉన్నాయని ఆరోపించారు.
12.11 PM
శ్వేతపత్రంలో ఉన్న అంశాలు
శ్వేతపత్రంలో ప్రభుత్వం హామీ లేని రుణాలు రూ.59,414 కోట్లు ఉన్నాయి.
- ప్రభుత్వ హామీతో ఎస్పీవీల రుణ బకాయిలు రూ.95,462 కోట్లు
- ప్రభుత్వ హామీ లేని రుణాలు రూ.59,414 కోట్లు
- ప్రభుత్వమే చెల్లించే ఎస్పీవీల రుణాలు రూ.1,85,029
- రాష్ట్ర మెుత్తం రుణాలు రూ. 6,71,757 కోట్లు
- శ్వేతపత్రం: ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు రూ.3,89,673
11.57 AM
ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తాం: భట్టి విక్రమార్క
ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామని భట్టి విక్రమార్క అన్నారు. సవాళ్లు అధిగమించే దిశలో శ్వేతపత్రం మొదటి అడుగు వేసిందని తెలిపారు.
11.53 AM
శ్వేతపత్రంలో ఉన్న అంశాలు
- రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం
- రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం
- రోజూ వేస్ అండ్ మీన్స్‌పై ఆధారపడాల్సిన దుస్థితి
- 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, 2023లో అప్పుల్లో కూరుకుపోయింది.
11.49 AM
బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం
బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం ఉందని శ్వేతపత్రం తెలుపుతుంది.
- రాష్ట్రంలో 2023-24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం
- బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం
- 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.4.98 లక్షల కోట్ల వ్యయం
- రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం
11.42 AM
2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు
రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ శ్వేతపత్రం 42 పేజీల ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మెుత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు ఉన్నాయి. 2014 -15 నాటికి రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లుగా చూపించారు. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం అప్పు పెరిగింది. 2015-16లో రాష్ట్ర రుణ, జీఎస్డీపీ 15 .7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉన్నది. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లుగా ఉంది.
11.32 AM
అసెంబ్లీ సమావేశాలు అరగంటపాటు వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అరగంట పాటు వాయిదా పడ్డాయి.
11.30 AM
42 పేజీల శ్వేతపత్రం విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రంను భట్టి విడుదల చేశారు. 42 పేజీల శ్వేతపత్రంను డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేశారు.
11.27 AM
నివేదికను చదివే సమయం కూడా మాకు ఇవ్వలేదు: హరీశ్‌రావు
42 పేజీల పుస్తకం ఇచ్చి ఇప్పుడు మాట్లాడాలి అంటే ఎలా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నివేదికను చదివే సమయం కూడా మాకు ఇవ్వలేదని మండిపడ్డారు. ముందు రోజే డాక్యుమెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే సమాధానం సంతృప్తి కలిగించకపోతే నిరసన చేసే అవకాశం ఉందన్నారు. సభను హుందాగా నడిపేందుకు బీఆర్ఎస్ పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
11.26 AM
దశాబ్దకాలంలో జరిగినటువంటి ఆర్థిక తప్పిదాలను ప్రజలకు తెలియాలి: భట్టి
ప్రజలందరూ అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దశాబ్దకాలం పాలించిన గత ప్రభుత్వం వనరులన్నీ అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఉపయోగించలేదన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందిని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితి రావడాన్ని తాను దురదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దశాబ్దకాలంలో జరిగినటువంటి ఆర్థిక తప్పిదాలను ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు.
11.16 AM
అసెంబ్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.
11.06 AM
ప్రారంభమైన శాసనసభ సమావేశాలు
నాలుగు రోజుల విరామం అనంతరం శాసనసభ సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభమయ్యాయి. సభ మొదలవ్వగానే స్పీకర్ పార్టీల శాసనసభాపక్ష నేతలను ప్రకటించారు. ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా అక్బరుద్దీన్, సీపీఐ శాసనసభా పక్ష నేతగా కూనంనేని సాంబశివరావులను ప్రకటించారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం ప్రకటించింది.
08:57 AM
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు - శ్వేత పత్రంపై శాసనసభలో స్వల్ప కాలిక చర్చ
నాలుగు రోజుల విరామం అనంతరం ఇవాళ శాసనసభలో తిరిగి సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాసరెడ్డి, కొప్పుల హరీశ్వర్ రెడ్డి, కుంజా సత్యవతికి సభ సంతాపం తెలపనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అలాగే శ్వేత పత్రంపై శాసనసభలో స్వల్ప కాలిక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.