Telangana Assembly Polling Arrangements 2023 : రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంటోంది. ప్రచారపర్వం మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రచారం తుది దశకు చేరుకున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India)పోలింగ్ ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఓటింగ్‌కు అవసరమైన బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తైంది. గతంలో జిల్లాల్లో బ్యాలెట్ పత్రాల ముద్రణ చేస్తుండగా.. ఈ సారి అన్ని బ్యాలెట్లను హైదరాబాద్ చంచల్‌గూడలోని ప్రభుత్వ ముద్రణాలయంలోనే ముద్రించారు.
Telangana Assembly Elections 2023 : మొత్తం 14 లక్షలకు పైగా బ్యాలెట్లు ముద్రించారు. ఇందులో పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) కోసం నాలుగు లక్షలకు పైగా ముద్రించగా.. ఈవీఎంల కోసం 8.84 లక్షల బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. టెండర్, ఛాలెంజ్డ్ ఓట్ల కోసం ప్రతి పోలింగ్ కేంద్రానికి.. పది చొప్పున బ్యాలెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అదనపు బ్యాలెట్లను ముద్రించారు. మరోపక్క.. దివ్యాంగులు, వృద్ధుల కోసం హోం ఓటింగ్ కొనసాగుతోంది.
అత్యవసర సేవల విభాగాలకు చెందిన వారికి.. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ ప్రక్రియను ఈనెల 26 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఓటుహక్కు వినియోగించుకునేలా.. ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొంత మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. సిబ్బందికి రెండు దశల శిక్షణ పూర్తి కాగా.. 25, 26 తేదీల్లో మరో దఫా శిక్షణ ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. మళ్లీ 29న పోలింగ్ బృందాలు కేంద్రాలకు వెళ్లే సమయంలో కూడా మరోమారు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.
Telangana Assembly Elections Polling 2023 : కొత్తగా 51 లక్షల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించారు. తపాలాశాఖ ద్వారా వాటి పంపిణీ కొనసాగుతోంది. పోలింగ్ కోసం ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియ జరుగుతోంది. 3.26 కోట్లకు గాను ఇప్పటి వరకు.. 2.81 కోట్ల స్లిప్పులను బీఎల్‌ఓల ద్వారా పంపిణీ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. రేపటి వరకు స్లిప్పుల పంపిణీ పూర్తవుతుందని అంటున్నారు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,655. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని 59,779 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. గరిష్ఠంగా ఎల్బీనగర్‌లో నాలుగు బ్యాలెట్ యూనిట్లు వాడనున్నారు.
Polling Stations in Telangana 2023 : నిన్న ప్రారంభమైన ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల కమిషనింగ్ ప్రక్రియ నేటితో పూర్తవుతుంది. ఈవీఎంలు తీసుకెళ్లే ప్రతి వాహనానికి, తనిఖీ బృందాల వాహనాలకు జీపీఎస్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచే కసరత్తులో భాగంగా.. స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 40,000 మంది రాష్ట్ర పోలీసులు, 24,000 మంది ఇతర రాష్ట్రాల పోలీసులతో పాటు 375 కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో ఉండనున్నాయి.
Counting Centers in Telangana 2023 : పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపునకు కూడా ఏర్పాట్లు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 49 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి ఒక్కో పరిశీలకుడిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నందున ఆయా నియోజకవర్గాల లెక్కింపు కోసం రెట్టింపు సంఖ్యలో టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణలో పక్కా ప్రణాళికతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి : సీఈసీ