ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపిన అనంతరం... సభలోని సభ్యులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో వచ్చిన ప్రజా ఉద్యమాలను ప్రణబ్ దగ్గరగా చూశారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని అర్థం చేసుకున్న గొప్ప నేత.. ప్రణబ్ అంటూ కొనియాడారు. ఉద్యమం తీరుతెన్నులను కేసీఆర్ పలుసార్లు ఆయనకు చెప్పారని... ప్రణబ్ అనేక సలహాలు ఇచ్చేవారని ఆయన గుర్తుచేశారు. తన పుస్తకంలో కేసీఆర్ గురించి ఉటంకించారని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.
కేసీఆర్‌తో దిల్లీ వెళ్లినప్పుడు ప్రణబ్‌ను కలిసే వాళ్లమని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. యూపీఏ సీఎంపీలో తెలంగాణ అంశం ఉంచేలా కృషి చేశామని... దిల్లీలో కొన్నిరోజులు ఉండి ప్రణబ్‌తో చర్చించామని మంత్రి పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అనేక వినతులు ఇచ్చి... ప్రత్యేక రాష్ట్రం కోసం అన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ ఒప్పించారని ఈటల గుర్తుచేశారు. ప్రణబ్‌ను కేసీఆర్ ఎప్పుడూ పితృ సమానుడిగా చూశారని తెలిపారు.
ఇదీ చూడండి: రాజకీయ సముద్రాన్ని సమర్థంగా ఈదిన నేత.. ప్రణబ్: కేసీఆర్