Telangana Assembly Elections Arrangements 2023 : పక్కా ప్రణాళికతో.. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా.. కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా నియమించిన ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు.. రాష్ట్రానికి చెందిన అధికారులతో భేటీ అయ్యారు. ఎన్నికల వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే పోలీసులను.. ఆ కేంద్రాల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ప్రస్తుతం పనిచేస్తున్న వారు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే పోలీసులు చేయాల్సిన.. చేయకూడని పనులతో జాబితా రూపొందించి అందించాలని ఈసీ ప్రత్యేకంగా నియమించిన అధికారుల బృందం సూచించింది.
Telangana Election Polling Arrangements 2023 : వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ సమావేశమయ్యారు. ఈసీ ప్రత్యేక పరిశీలకులుగా నియమించిన విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు అజయ్ వి. నాయక్, దీపక్ మిశ్రా, బాలకృష్ణన్ సమావేశంలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న వారు కచ్చితంగా పాటించాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు.
రాజకీయ కార్యక్రమాలను వీడియోలు తీయడంపై అన్ని వీడియో నిఘా బృందాలకు శిక్షణ ఇవ్వాలని, అయితే వారు మొబైల్ ఫోన్లతో కాకుండా కచ్చితంగా కెమెరాలతోనే చిత్రీకరించాలని.. పరిశీలకులు సూచించారు. ఓటర్ల జాబితాకు సంబంధించి, పెండింగ్‌లో ఉన్న అన్ని ఫారం 6 దరఖాస్తులను ఈనెల 10 లోగా పరిష్కరించాలని స్పష్టంచేశారు. ప్రతి జిల్లాలో ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదులను ఫిర్యాదుదారు ఫోన్ నంబర్‌తో నమోదు చేయాలని సూచించారు. కొందరు ఫిర్యాదుదారులను సంప్రదించడం ద్వారా పరిష్కారాలను ధృవీకరించాల్సి ఉంటుందని వివరించారు.
Telangana Assembly Election 2023 : అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు మొబైల్ ఫోన్లలో సీవిజిల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నట్లు రిటర్నింగ్ అధికారులు నిర్ధారించుకోవడం సహా.. సీవిజిల్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వెలుపల వీడియోగ్రఫీ అవసరమని భావించిన వాటిని గుర్తించి జాబితా సిద్ధం చేయాలనీ.. ఆ కెమెరాల ఫుటేజీని పోలీసు కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేయాలని ప్రత్యేక పరిశీలకులు స్పష్టంచేశారు.
పోలింగ్ రోజున మీడియా ఛానళ్లపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేయాలని.. ఏదైనా ప్రతికూల వార్త ప్రసారమైతే నోడల్ అధికారి వెంటనే వాస్తవ వివరాలు తెలుసుకోవాలని చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పూర్తి సామర్థ్యంతో.. మంచి ఫలితాలు వచ్చేలా చూడాలని చెప్పారు. వారి సామర్థ్యం మేరకు పని చేయాలని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ అజయ్ బాదూ అదేశించారు. ఎన్నికల వ్యయ బాధ్యతలు చూసే ఈసీ డైరెక్టర్ పంకజ్ శ్రీవాస్తవ్, ప్రత్యేక వ్యయపరిశీలకుడు బాలకృష్ణన్ సీనియర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో సమావేశమయ్యారు.
శాసనసభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం