Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో 14 రోజులే సమయం ఉంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఊరూవాడా ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. తమకే ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అయితే.. వజ్రాయుధం లాంటి ఓటు హక్కు తమ చేతిలో ఉన్నా.. తమకు కావాల్సిన నాయకుడిని తామే ఎన్నుకునే సువర్ణావకాశం వారిదే అయినా.. చాలా మంది అందుకు ఆసక్తి చూపడం లేదు. బాధ్యతగా ఓటు వేయాల్సిన ఓటర్లు.. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ధోరణి కాస్త తక్కువగా ఉన్నా.. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో మాత్రం ఎక్కువ మంది ఓటుకు దూరంగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.
ఓటే నీ ఆయుధం- విడవకు నీ బ్రహ్మాస్త్రం
Compulsory Voting System in Hyderabad : జీహెచ్ఎంసీ పరిధిలో ఏ ఎన్నికలు జరిగినా.. ఓటింగ్ 60 శాతానికి మించడం లేదు. నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓట్లలో కేవలం 30 శాతం ఓట్ల వస్తే చాలు.. ఆ అభ్యర్థి ఎమ్మెల్యే అయి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. తమకు కావాల్సిన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో 40 శాతం మంది నగర వాసులు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ఓటింగ్ కోసం వివిధ దేశాల్లో అవలంభిస్తున్న నిర్బంధ ఓటింగ్ విధానాన్ని ఇక్కడా అమలు చేస్తే ఫలితం ఉంటుందని పలు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
Voter Awareness Telangana : 'నేను కచ్చితంగా ఓటు వేస్తా'.. నినాదంతో హోరెత్తుతున్న తెలంగాణ
పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు : ఉక్రెయిన్, బెల్జియం, ఆస్ట్రియా, మెక్సికో, బ్రెజిల్, ఫిలిప్పీన్స్ సహా 33 దేశాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోతే ప్రభుత్వ సదుపాయాలను రద్దు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు ఓటు వేయకపోతే.. వారి వేతనాల్లో కోత విధిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టులను రద్దు చేస్తున్నారు. ఇటలీలో అయితే ఎప్పుడు పోలింగ్ జరిగినా ఓటు వేయని వారి జాబితాను అధికారులు సేకరిస్తారు. పోలింగ్ ప్రదేశాల్లో ఆ పేర్లను ప్రదర్శిస్తారు. దీంతో ఓటర్లు ఓటింగ్ విషయంలో అలసత్వం ప్రదర్శించరు.
ఓటు వేయకపోతే జరిమానా : ఆస్ట్రేలియాలో నిర్బంధ ఓటింగ్ విధానం అమలు చేస్తున్నారు. అర్హత వయసు వచ్చాక.. ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఓటింగ్‌లో తప్పనిసరిగా పాల్గొని తమ బాధ్యతను నిర్వర్తించాలి. ఒకవేళ ఓటు వేయకపోతే జరిమానా విధించేలా నిబంధనలు ఉన్నాయి. బెల్జియంలో అయితే ఓటు హక్కును వినియోగించుకోని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. మొదటిసారి ఓటు వేయకపోతే రూ.2 వేల నుంచి 4 వేల యూరోలు, రెండోసారి అయితే రూ.10 వేల యూరోల వరకు ఫైన్ వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు, సదుపాయాలు, పథకాల్లో ప్రాధాన్యం తగ్గిస్తారు. ఓటరు జాబితాలో పేరు ఉండి, వరుసగా నాలుగు సార్లు ఓటు వేయకపోతే పదేళ్ల వరకూ ఓటు హక్కును తొలగించేస్తారు.
ఈ దేశాల్లో అత్యధిక పోలింగ్ శాతం : ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యే దేశాల్లో ఆస్ట్రేలియా, ఇటలీ, బెల్జియం, లక్సెంబర్గ్, చిలీ దేశాలు ముందు వరుసలో ఉంటాయి. ఇక్కడ 90 నుంచి 96 శాతం మేర పోలింగ్ నమోదవుతుంటుంది. న్యూజిలాండ్, నెదర్లాండ్స్, ఐస్‌లాండ్ దేశాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదవుతోంది.