Telangana Assembly Elections Exercise 2023 : ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్ పోలీసులు ముందస్తుగా సిద్ధమవుతున్నారు. రెండు కమిషనరేట్ల పరిధిలో ప్రజల్ని ప్రభావితం చేసే వ్యక్తులను, ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్ చేయనున్నారు. ఈ నివేదికను ఈసీకి పంపించి వారి ఆదేశాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, ఇతర అంశాలపై మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అమోయ్‌కుమార్, ఎస్.హరీశ్‌తో కలిసి.. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్.. సైబరాబాద్ కమిషనరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు జిల్లాల రెవెన్యూ అధికారులు, ఇరు కమిషనరేట్ల అధికారులు పాల్గొన్నారు.
గత ఎన్నికల్లో 80 నుంచి 90 శాతం ఓటింగ్ నమోదైన ప్రాంతాల్ని మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా గుర్తించనున్నారు. ఈ ప్రాంతాల్లో కులం, మతం ఆధారంగా ప్రజల్ని ప్రభావితం చేసి అనుకూలంగా ఓట్లు వేయించుకునే వ్యక్తులు.. భయపెట్టే అసాంఘిక శక్తుల్ని గుర్తించనున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో సమస్యాత్మక ప్రాంతాలు, ప్రభావితం చేసే వ్యక్తులు, రౌడీషీటర్ల డేటా తయారు చేస్తారు. ఇందుకోసం నియోజకవర్గానికో ఎన్నికల అధికారి ఉంటారు. భద్రతా పరమైన చర్యల పర్యవేక్షణకు నియోజకవర్గ స్థాయిలో ఏసీపీ, సెక్టార్లకు ఎస్‌ఐలు నేతృత్వం వహిస్తారు. ఓటింగ్ సమయంలో సమస్యలు సృష్టించే వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తారు. నేర తీవ్రత అధికంగా ఉండే వ్యక్తుల్ని బైండోవర్ చేయడం వంటి చర్యలు తీసుకుంటారు. దోపిడీలు, దొంగతనాలు, తీవ్ర నేరారోపణలున్న వ్యక్తులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటారు.
ఈ క్రమంలోనే సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పనిచేయాలని.. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు రేకెత్తించేలా తప్పుడు ప్రచారం చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాచకొండ సీపీ చౌహన్ వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, విధులు, అధికారాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
Telangana Assembly Elections 2023 : మరోవైపు తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న ఈసీ వేగం పెంచింది. ఈ క్రమంలో రానున్న ఎన్నికల దృష్ట్యా జిల్లాల ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు అధికారులను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కమిషనర్ వ్యవహరించనున్నట్లు ఈసీ తెలిపింది.
అదేవిధంగా మిగిలిన 32 జిల్లాలకు ఎన్నికల అధికారులుగా.. ఆయా జిల్లాల కలెక్టర్లను ఈసీ నియమించింది. ఈఆర్వోలుగా.. అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఐటీడీఏ పీఓలు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. ఓటర్ల జాబితా నిర్వహణ, ఓటర్ల నమోదు, వివరాలు తదితరాలను ఈఆర్వోలు పర్యవేక్షిస్తారు.
ఇవీ చదవండి : Telangana Assembly Elections 2023 : ఎన్నికల ఎఫెక్ట్.. అధికారుల బదిలీలపై కసరత్తు షురూ
Telangana Assembly Elections 2023 : హైదరాబాద్‌కు ఈసీ.. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష