తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై ప్రతిష్టంభన కొలిక్కిరాలేదు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక అంశాలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కూడా పీటముడి వీడలేదు. కేసులను ఉపసంహరించుకుంటే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు సానుకూలత ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్రం ఏపీకి స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్ అధ్యక్షతన ఉప సంఘం తొలి సమావేశం గురువారం దృశ్య మాధ్యమంలో జరిగింది. ‘‘పన్ను వివాదాల అంశం పరిష్కారానికి ఏపీ కోరుతున్నట్లు పునర్విభజనచట్ట సవరణ ఇప్పుడు అవసరంలేదు. చట్టం అమల్లోకి వచ్చిన ఏడున్నరేళ్ల తర్వాత సవరణ ఆమోదయోగ్యం కాదు. పైగా కొత్త వివాదాలకూ దారి తీస్తుంది. ఏపీ నష్టపోయిన మొత్తాన్ని కేంద్రం ఇస్తే సరిపోతుంది’’ అని తెలంగాణ స్పష్టం చేయగా ఈ అంశం రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాదని పేర్కొంటూ హోంశాఖ దీన్ని ఎజెండా నుంచి తొలగించింది. సమావేశం వివరాలను తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది.
విద్యుత్’ బకాయిలు..
‘‘ఏపీజెన్‌కో నుంచి మాకు రూ.12,532 కోట్లు రావాలి. కానీ ఏపీ రూ.3,442 కోట్లే రావాల్సి ఉందని అంటోంది. పైగా తెలంగాణ జెన్‌కోపై విద్యుత్ బకాయిల కోసం హైకోర్టులో కేసు వేసింది.కేసును ఉపసహరించుకుంటే చర్చల ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించుకునేందుకు మేం సిద్ధం. బకాయిలను వేర్వేరుగా కాకుండా ఒకే అంశంగా గుర్తించి పరిష్కరించుకోవాల్సి ఉంది. మాకు ఏపీ జెన్‌కో ఆకస్మికంగా విద్యుత్ సరఫరాను ఆపేయడంతో ఎక్కువ రేట్లకు విద్యుత్ కొనాల్సి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో హిందుజా, ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కృష్ణపట్నం ప్లాంట్లతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఏకపక్షంగా ఏపీ రద్దు చేసింది. ఈ పరిస్థితుల్లో మేము ఎక్కువ రేట్లకు విద్యుత్ కొన్నాం. అనంతపురం, కర్నూలు జిల్లాలకు తెలంగాణ విద్యుత్ సరఫరా చేసింది. మాపై రూ.12,532 కోట్లు ఈ అదనపు భారం పడింది.
ఏపీఎస్‌ఎఫ్‌సీ..
దీనిపై ఏపీ ప్రభుత్వం డిమెర్జర్ ప్రతిపాదనలను ఏకపక్షంగా కేంద్రానికి పంపింది. తెలంగాణ ప్రతినిధులు బోర్డులో లేకుండానే తీర్మానం చేసి పంపింది. దాన్ని అమలు చేయకూడదని కేంద్రానికి వివరించాం. తెలంగాణ ప్రతినిధులతో బోర్డును పునర్‌వ్యవస్థీకరించాలని 2016 మే నెలలో కేంద్రాన్ని కోరాం. పునర్విభజన చట్టం సెక్షన్ 71 (బి)ని ఉపయోగించుకోవాలని అభ్యర్థించాం. ఈ ప్రతిపాదన ఇంకా అపరిష్కృతంగానే ఉంది. అదీకాక ఏపీ ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌సీకి చెందిన 235.34 ఎకరాలపై కోర్టు స్టే తెచ్చింది. ఎస్‌ఎఫ్‌సీ ప్రధాన కార్యాలయం కాని నానక్‌రాంగూడలోని భవనంలో వాటా అడగడం సరికాదు. ఆంధ్రప్రదేశ్ కోర్టు కేసులను ఉపసంహరించుకుంటే తప్ప ఎస్‌ఎఫ్‌సీ విభజన అంశం పరిష్కారం కాదు.
ఏపీ పౌరసరఫరాల సంస్థ వ్యవహారాలు..
ఈ సంస్థకు పెట్టుబడి మొత్తం రూ.354.08 కోట్లు ఇవ్వడానికి తెలంగాణ సిద్ధంగా ఉంది. అయితే అంతకుముందు కేంద్రం నుంచి మా పౌరసరఫరాల సంస్థకు రావాల్సిన సబ్సిడీని బదిలీ చేస్తామని ఏపీ అండర్‌టేకింగ్ ఇవ్వాలి. ఏపీ ప్రభుత్వం దాన్ని ఇవ్వడానికి తాజాగా అంగీకరించింది.
ఏపీ ఇవ్వాల్సిన మొత్తంపై..
ఏపీ నుంచి మాకు రావాల్సిన కేంద్ర పథకాల బకాయిలు రూ.495.21 కోట్లు ఏడేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతోపాటు ఉమ్మడిగా ఉన్న హైకోర్టు, రాజ్‌భవన్ వంటి వాటికి మేం వ్యయం చేసిన రూ.315.76 కోట్లను వెంటనే ఇవ్వాలి. నిర్మాణరంగ కూలీల సంక్షేమ బోర్డు, కార్మికుల సంక్షేమనిధి వాటా రూ.464.39 కోట్లు, ఎన్‌సీసీఎఫ్‌కి చెందిన రూ.208.24 కోట్లు కూడా ఏపీ ఇంత వరకు చెల్లించలేదు. ఇవన్నీ అందేలా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోవాలి’’ అని తెలంగాణ కోరింది.
సమావేశంలో తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, వాణిజ్యపన్నులశాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు, జేఎండీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఉన్నతాధికారులు ముఖేష్‌కుమార్ మీనా, గిరిజాశంకర్‌లు పాల్గొన్నారు.
రెండు అంశాలపై న్యాయ సలహాకు!
కేంద్ర హోంశాఖ ఉప కమిటీ నిర్ణయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న వివిధ వివాదాస్పద అంశాల్లో రెండు అంశాలపై న్యాయసలహా తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉప కమిటీ నిర్ణయించింది. ఇందులో రాష్ట్ర ఫైనాన్సు కార్పొరేషన్ విభజన అంశాన్ని కేంద్ర లీగల్ కౌన్సిల్‌కు నివేదించనున్నట్లు వారు వెల్లడించారు. విద్యుత్తు బకాయిల అంశంలో ఆంధ్రప్రదేశ్ కోర్టుకు వెళ్లినందున ఇందులో కేంద్ర హోంశాఖ జోక్యానికి ఎంతవరకు ఆస్కారం ఉందో చర్చించి తేల్చాలని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సంబంధిత మంత్రిత్వశాఖ సాయంతో ఈ విషయంలో తాము ఎంత వరకు జోక్యం చేసుకోగలమో పరిశీలించాక ముందుకు వెళ్తామన్నారు. మిగిలిన అన్ని విషయాల్లో సాంకేతిక అంశాలను అధ్యయనం చేసి మరో నెల రోజుల్లోగా మరో సమావేశం ఏర్పాటు చేస్తామని కమిటీ హామీ ఇచ్చింది. కేంద్ర హోంశాఖ నియమించిన ఉపసంఘం గురువారం అయిదు అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులతో చర్చించింది.
ఇదీ చూడండి: స్టాక్ మార్కెట్‌కు సారథి.. కానీ 'అదృశ్య' యోగి చేతిలో కీలుబొమ్మ.. ఇది ఓ 'చిత్ర' కథ!