ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్ర వ్యాప్తంగా 75,718 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తప్పనిసరి బదిలీ అయ్యేవారు 24,535 మంది ఉండగా.. రెండేళ్లు పూర్తి చేసుకొని అభ్యర్థన బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారు 51,183 మంది ఉన్నారు. దరఖాస్తుల పరిశీలన ఇవాళ రాత్రి వరకు నిర్వహించనున్నారు. పరిశీలన కోసం ఉపాధ్యాయులను కార్యాలయాలకు పిలిపించకూడదని, ఈ ప్రక్రియలో వారిని భాగస్వామ్యం చేయొద్దంటూ పాఠశాల విద్య కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది.
సీనియారిటీ జాబితా
ప్రాథమిక సీనియారిటీ జాబితాను 19 నుంచి 23 వరకు జిల్లాల వారీగా అందుబాటులో ఉంచనున్నారు. ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రస్తుతం పట్టణాలు, నగరాలకు సమీపంలో పనిచేస్తున్న వారిలో దాదాపు 10 వేల మంది మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. కేటగిరి-3, 4లోని బడులకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరి బదిలీకి దరఖాస్తు చేసిన వారిలో సుమారు 8 వేల మంది హేతుబద్దీకరణ కారణంగా పోస్టు కోల్పోయిన వారు ఉన్నారు.
పోస్టుల బ్లాక్
బదిలీల్లో భాగంగా ఆయా జిల్లాల్లో కొన్ని పోస్టులను బ్లాక్ చేయనున్నారు. ఒక జిల్లాకు మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు, ప్రస్తుతం పని చేస్తున్న వారికి మధ్య ఉండే వ్యత్యాసం పోస్టులను బ్లాక్ చేస్తారు. ఇలా బ్లాక్ చేసే పోస్టులు ఎక్కువగా కేటగిరి-1,2,3 లలో ఉండనున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థుల వరకు రెండు పోస్టులు ఇచ్చారు. ఇలాంటి వాటిల్లో 20 లోపు విద్యార్థులు ఉంటే ఒకటి బ్లాక్ చేసే అవకాశం ఉంది.
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఖాళీలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఉపాధ్యాయ ఖాళీలపై జిల్లా విద్యాధికారులు కసరత్తు చేస్తున్నారు. పాఠశాలల ఎంపికకు డిసెంబరు 3 వరకు సమయం ఉన్నందున అప్పటి లోపు ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.
ఇదీ చదవండి: గ్రేటర్ బరి: అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ కసరత్తులు