Teachers Maha dharna on February 09th: ఫిబ్రవరి 9న హైదరాబాద్ ధర్నాచౌక్లో మహా ధర్నాకు ఉపాధ్యాయ సంఘాల స్టీరింగ్ కమిటీ పిలుపునిచ్చింది. జీవో 317 ద్వారా రాష్ట్రంలో నష్టపోయిన ఉపాధ్యాయులందరికీ న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని కమిటీ స్పష్టం చేసింది. తెలంగాణ పీఈటీ అసోసియేషన్ విద్యాసాగర్ అధ్యక్షతన పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు వర్చువల్గా సమావేశమయ్యారు. ఉద్యోగుల ఉద్యమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలను కమిటీ తీవ్రంగా ఖండించింది.
ప్రధాని పర్యటన దృష్ట్యా
ఉద్యోగులు అందరినీ మౌఖిక ఆదేశాలతో కొత్త పోస్టుల్లో చేరేటట్లు ఒత్తిడి తెచ్చి చేర్పించారని కమిటీ నేతలు ఆరోపించారు. బదిలీల్లో అన్యాయం జరిగిందని మొరపెట్టుకున్నా.. ముందుగా కొత్త లోకల్ క్యాడర్లో రిపోర్ట్ చేసిన తర్వాతనే అప్పీల్ చేసుకోవాలని షరతు విధించారని పేర్కొన్నారు. అప్పడు వాటిని పట్టించుకోకుండా ఇప్పుడు అందరూ చేరిపోయారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ... ఫిబ్రవరి 5న మహా ధర్నా నిర్వహణపై చర్చించారు. అదే రోజు ప్రధానమంత్రి పర్యటన ఉండటంతో.. భద్రతా కారణాల దృష్ట్యా ధర్నాను ఫిబ్రవరి 9 కి వాయిదా వేస్తున్నట్లు విద్యాసాగర్ తెలిపారు. ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో యూఎస్పీసీ జిల్లా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లు, సమావేశాలు నిర్వహించాలని, ఏడో తేదీన హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో మీడియా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
ఇవీ చదవండి: Unemployment in Telangana : తెలంగాణలోనే నిరుద్యోగులు తక్కువట
Telangana High Court On Kaloji University Appeal : 'రీవాల్యుయేషన్ చేశాకే పరీక్షలు నిర్వహించండి'