జీవో 317 అప్పీళ్లను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ స్టేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు హైదరాబాద్ లక్డీకపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. జీవో 317 అప్పీళ్లు పరిష్కరించేంత వరకు పోరాటం ఆపేది లేదని స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు సదానందం గౌడ్ తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు తలపెట్టినా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటం ఉధృతం చేస్తాం తప్ప వెనుకడుగు వేసేది లేదని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.
స్పౌజ్ అభ్యర్థులను అన్ని జిల్లాలకు అనుమతించాలని సదానందం గౌడ్ కోరారు. హైకోర్టు తీర్పుననుసరించి ఒంటరి మహిళలు, వితంతువుల అప్పీళ్లను పరిష్కరించాలన్నారు. సీనియారిటీలో దొర్లిన తప్పులను సరిచేసి అర్హులైన వారికి న్యాయం చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలు చేపట్టాలని సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకొని నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: Metro Super Saver Card: 'రూ.59తో రోజంతా మెట్రోలో తిరగొచ్చు!.. ఎలాగంటే..'