Teacher MLC elections: హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి ఎన్నికలో బహుముఖ పోటీ నెలకొంది. ఇటు ఉపాధ్యాయ సంఘాలతో పాటు.. రాజకీయ పార్టీల్లోనూ వేడి పుట్టిస్తోంది. ఈనెల 16న ప్రారంభమైన నామినేషన్లు.. 23 వరకు కొనసాగనున్నాయి. గత 2017 ఎన్నికల్లో 14 మంది పోటీ చేయగా.. ఈసారి 20 మంది అభ్యర్థుల వరకు బరిలో ఉండొచ్చని అంచనా.
గత ఎన్నికల్లో భారాస మద్దతుతో PRTU-TS అభ్యర్థి కాటేపల్లి జనార్దన్‌రెడ్డి గెలిచారు. అయితే పీఆర్‌టీయూ టీఎస్ తమ అభ్యర్థిగా కాటేపల్లి జనార్దన్‌రెడ్డి బదులుగా చెన్నకేశవరెడ్డిని పోటీకి దించింది. దీంతో కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పీఆర్‌టీయూ తెలంగాణ సంఘం తరఫున పోటీకి దిగారు. మరోవైపు వామపక్ష పార్టీల అనుకూల సంఘాలు యూటీఎఫ్, ఎస్టీయూ కూడా రంగంలో ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎవరికీ మద్దతు ప్రకటించకుండా వ్యూహాత్మకంగా తటస్థంగా ఉండాలని భావిస్తోంది.
మరోవైపు బీజేపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించింది. దిల్‌సుఖ్‌నగర్ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ ఏవీఎన్ రెడ్డి భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగారు. భాజపా అనుకూల సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం.. తపస్ మద్దతు ఉంది. ఏవీఎన్ రెడ్డి గత ఎన్నికల్లో ఎస్‌టీయూ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో హర్షవర్దన్‌రెడ్డి నామినేషన్ వేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన హర్షవర్దన్ రెడ్డి గత టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ తెలంగాణ తరఫున పోటీ చేసి ఓడిపోయి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన మాణిక్ రెడ్డి ఈసారి కూడా యూటీఎఫ్ తరఫున రంగంలో ఉన్నారు. ఎస్‌టీయూ నుంచి భుజంగరావు ప్రచారం చేస్తున్నారు. టీపీటీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేఎన్టీయూహెచ్ మాజీ ప్రొఫెసర్ వినయ్ బాబుకు బీఎస్పీ మద్దతునిస్తోంది. ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఓట్లపై ఆశతో తెలంగాణ స్కూల్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమార్ పోటీకి దిగారు. టీయూటీఎఫ్, జీటీఏ, లోకల్ కేడర్ జీటీఏ, బీసీటీఏ తదితర సంఘాల అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో 29 వేల 501 మంది టీచర్లు ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 15 వేల 425.. మహిళలు 14 వేల 74 మంది ఉన్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 8 వేల 687 మంది ఉండగా.. మేడ్చల్‌లో 6 వేల 771, హైదరాబాద్‌లో 3 వేల 775, మహబూబ్ నగర్‌లో 3 వేల 567, వికారాబాద్‌లో 1937, నాగర్ కర్నూలులో 1804, వనపర్తిలో 1399, జోగులాంబ గద్వాల జిల్లాలో 873, నారాయణపేటలో 688 మంది ఓటర్లు ఉన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు సుమారు 6వేల మంది ఉన్నారు. మార్చి 13న 126 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. పోటీలో ఉన్న ఉపాధ్యాయ నేతలు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు.
ఇవీ చదవండి: