TDP LEADERS MEET GOVERNOR: ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈనెల 4న తెలుగుదేశం అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని, గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరిన ఘటనకు సంబంధించి ఇంకా నిందితుల ఆచూకీ దొరకలేదు. ఘటన జరిగి మూడ్రోజులైనా, దర్యాప్తు కొలిక్కి రాలేదు. ఇందులో రాజకీయ కారణాలు ఇమిడి ఉండడమే ఇందుకు కారణమని తెలుగుదేశం ఆరోపిస్తోంది. అనుమానితుల కదలికలపై తెలుగుదేశం ఫొటోలు విడుదల చేసింది.
కేసులో పురోగతి లోపించిందని, నిందితులను పట్టుకోవడంలో జాప్యం చేస్తున్నారని నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై నేడు తెదేపా నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. రాళ్లదాడి ఘటనపై ఇప్పటికే నందిగామ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు సీఎస్‌ఓ మధుబాబు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫిర్యాదు చేయగా, పోలీసులు నామమాత్రపు బెయిలబుల్ కేసు నమోదు చేశారని వారు విమర్శించారు. పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం గవర్నర్‌ను కలవనున్నారు.
ఇదీ జరిగింది: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. బాదుడే బాదుడు నిరసన రోడ్ షో నిర్వహిస్తున్న చంద్రబాబుపైకి ఓ దుండగుడు రాయి విసరడం కలకలం రేపింది. ఈ ఘటనలో చంద్రబాబు ప్రధాన భద్రతా అధికారి మధుకి గాయాలయ్యాయి. తన పర్యటనలో పోలీసులు భద్రత సరిగ్గా లేకపోవడం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా గూండాలు 'ఖబడ్దార్' అంటూ హెచ్చరించారు. వైకాపా రౌడీలకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. గాయపడ్డ సీఎస్‌ఓ మధుబాబుకు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. గడ్డం కింది భాగంలో మధుబాబుకు గాయమయ్యింది.
ఇవీ చదవండి: