Gudivada Casino Allegations: గుడివాడ క్యాసినో ఆరోపణలకు సంబంధించిన వివరాలను తెలుగుదేశం బృందం.. ఐటీశాఖ అధికారులకు అందజేసింది. కొడాలి నాని, వల్లభనేని వంశీ నేతృత్వంలో క్యాసినో నిర్వహించారంటూ.. టీడీపీ గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తోపాటు వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలకు ఫిర్యాదు చేసింది. వాటికి సంబంధించిన వివరాలు అందించాలని.. వర్ల రామయ్యను ఆదాయపు పన్నుశాఖ కోరింది. ఈ వివరాలను అందించేందుకు వర్ల రామయ్య, బొండా ఉమ, కొనకళ్ల నారాయణ, రావి వెంకటేశ్వరరావు.. విజయవాడలోని ఐటీ కార్యాలయానికి వెళ్లారు.
పేరుకు ఎడ్ల పందాలు పెడుతున్నామని.. వెనక క్యాసినో నడిపారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. గుడివాడలో క్యాసినో నిర్వహిస్తున్నామని చికోటి ప్రవీణ్ ప్రచారం చేసిన ఆధారాలను ఐటీ అధికారులకు అందించామని ఆయన వెల్లడించారు. చికోటి ప్రవీణ్ తనకు స్నేహితుడేనని వంశీ స్వయంగా చెప్పారని ఆరోపించారు. ఈ వ్యవహరంలోకి కొడాలి నాని వేలాది మందిని రప్పించారని మండిపడ్డారు.
వేలకు వేలు ఎంట్రీ ఫీజులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ క్యాసినోలో దాదాపు 500 కోట్ల మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయని అన్నారు. హవాలా రూపంలో ఆ నగదును దారి మళ్లించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. హవాలా సొమ్మును దారి మళ్లించేందుకు చికోటి సాయపడ్డారని.. దీనిలో ఎంత మొత్తం చేతులు మారాయనేది తమ వద్దనున్న వివరాలను ఐటీకి ఇచ్చామని తెలిపారు. క్యాసినో గురించి రాష్ట్ర అధికారులు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. అందుకే కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.
ఇవీ చదవండి: